iDreamPost
android-app
ios-app

ఆ రెండు రోజుల్లో సినిమాల దాడి

  • Published Aug 09, 2021 | 6:55 AM Updated Updated Aug 09, 2021 | 6:55 AM
ఆ రెండు రోజుల్లో సినిమాల దాడి

టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయ్యింది. మొన్నటి దాకా థియేటర్లు లేవు. తెరిచాక సినిమాల కరువు వచ్చి చిన్న బడ్జెట్ చిత్రాలను వదిలారు. ఫస్ట్ వీక్ సోసోగానే అనిపిస్తే 6న రిలీజైన ఎస్ఆర్ కళ్యాణ మండపం లెక్కలన్నీ మార్చేసింది. రివ్యూలు టాక్ కు అతీతంగా తన రేంజ్ కు మించిన వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ వచ్చే స్థాయిలో ఆడటంతో ట్రేడ్ తో పాటు ఇతర నిర్మాతల్లో తమ సినిమాల మీద ఒక్కసారిగా నమ్మకం పెరిగిపోయింది. అంతే ఇక పోటీపడి మరీ ప్రకటనల వర్షం గుప్పిస్తున్నారు. మేమంటే మేమంటూ పోస్టర్ల మీద పోస్టర్లు వదులుతున్నారు.

వచ్చే 13 మరియు 14 తేదీలలో ప్రతి సినిమాను థియేటర్లో చూసే అలవాటు ఉన్న మూవీ లవర్స్ కు చుక్కలు కనిపించడం ఖాయం. రోజుకు నాలుగు ఆటలు సరిపోవనే రేంజ్ లో మూకుమ్మడిగా దండయాత్రలు జరగబోతున్నాయి. సునీల్ నటించిన ‘కనపడుట లేదు’ ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఓ మోస్తరు ఆసక్తిని రేపింది. ‘బ్రాందీ డైరీస్’ ప్రమోషన్ రూపంలో గత ఏడాది అంతో ఇంతో బజ్ తెచ్చుకోగా పూర్ణ నటించిన ‘సుందరి’ ఎప్పుడో ఈ డేట్ ని లాక్ చేసుకుంది. డబ్బింగ్ సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’ని సిద్దార్థ్ ఇమేజ్ మీద మార్కెట్ చేస్తున్నారు. చైతన్యం, సలాం నమస్తే, రావే నా చెలియా అనే మరో మూడు మొత్తం 13వ తేదీనే వస్తున్నాయి.

ఇక అన్నిటి కంటే కాస్త ఎక్కువగా బజ్ ఉన్నది విశ్వక్ సేన్ ‘పాగల్’. దిల్ రాజు నిర్మాణం కావడంతో విడుదల కూడా అంతో ఇంతో భారీగానే ఉంటుంది. 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అదే రోజు ఆర్ నారాయణమూర్తి ‘రైతన్న’ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా హాలీవుడ్ మూవీస్ జంగల్ క్రూజ్, కాంజూరింగ్ డెవిల్, డెమాన్ స్లేయర్ లాంటివి తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో సిద్ధమవుతున్నాయి. ఇన్నేసి సినిమాల మధ్య ఆప్షన్ ను ఎంచుకోవడం కష్టమే. చిన్న సినిమాలు ఇంత విపరీతమైన పోటీకి తెగబడటం లాభమో నష్టమో పక్కనపెడితే ఒక్కసారి రిలీజైతే చాలు మోక్షం దక్కినట్టు ఫీలవుతున్నారు కాబోలు నిర్మాతలు

Also Read : ముచ్చటగా మూడోసారి క్రేజీ కాంబో ?