iDreamPost
iDreamPost
దేశానికి ఉత్తరాన హిమాలయ సానువుల్లో ఉన్న కాశ్మీర్లో 1990 దశాబ్దంలో జరిగిన హిందూ పండిట్ల ఊచకోత, మహిళలపై అఘాయిత్యాలు, వేలాది కాశ్మీరీ పండిట్ కుటుంబాల వలసలపై రూపొందించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. డాక్యుమెంటరీ తరహాలో నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగానూ పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ వాస్తవ గాధను ప్రతి ఒక్కరూ చూడాలని హిందూ సంస్థలు, బీజేపీ ఆ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా చూసేందుకు పోలీసులకు సెలవులు కూడా ఇస్తున్నారు. ఇదే తరహాలో దేశ దక్షిణాపథంలో కేరళలో గత 12 ఏళ్లుగా జరుగుతున్న ముస్లిమేతర యువతుల కిడ్నాపులు, మత మార్పిడులు వంటి వాస్తవిక అంశాలతో ది కేరళ స్టోరీ పేరుతో చలనచిత్రం రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విపుల్ అమృత్ లాల్ షా దీన్ని నిర్మిస్తుండగా సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి.. దానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగులో ఉంది.
పుష్కర కాలంగా లవ్ జిహాద్ ఆరోపణలు
కేరళతో పాటు యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతర మతాలకు చెందిన యువతులను నిషేధిత ముస్లిం ఉగ్రవాద గ్రూపులకు చెందిన యువకులు ప్రేమ పేరుతో వలలో వేసుకుని, కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్పించి సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ తదితర ఇస్లామిక్ దేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇవే లవ్ జిహాద్ గా పేరుపొంది వివాదాలు రేపాయి. 2009లో తొలిసారి ఈ ఆరోపణలు వినిపించాయి. సనాతన ప్రభాత్, హిందూ జనజాగృతి సమితి వంటి మతవాద ప్రచురణ సంస్థలు లవ్ జిహాద్ ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేయగా, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ వంటి సంస్థలు దాన్ని అందిపుచ్చుకున్నాయి. గత 12 ఏళ్లలో ఒక్క కేరళ నుంచే సుమారు 32 వేలమంది యువతులను బలవంతంగా మతం మార్పించి దేశం దాటించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. కేరళను ముస్లింరాజ్యంగా మార్చేందుకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో అమ్మాయిల అదృశ్యం, కిడ్నాప్ ఉదంతాలపై ఫిర్యాదులు నమోదు అవుతున్నా అవి లవ్ జిహాద్ ఘటనలని నిరూపించే ఆధారాలు ఏవీ లభించలేదని 2009, 2010, 2012, 2014 సంవత్సరాల్లో పలు కేసుల్లో నిర్వహించిన దర్యాప్తుల్లో తేల్చేశారు. అయినా ఇప్పటికీ లవ్ జిహాద్ ఆరోపణలు సజీవంగానే ఉన్నాయి. అంతెందుకు 2020లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చేసింది. దీన్నే లవ్ జిహాద్ చట్టం అని కూడా వ్యవహరిస్తున్నారు. యూపీ బాటలోనే మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇటువంటి చట్టాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్రిస్టియన్ సంస్థల్లోనూ ఆందోళన
ఇంతకాలం మనదేశంలో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం తొలిసారి మత మార్పిడులపై ఆ మిషనరీలు ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. కేరళలో 2020లో క్రిస్టియన్ యువతులను కిడ్నాప్ చేసి మతం మార్పించారని ఆరోపిస్తూ లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా క్యాథలిక్ చర్చ్ మదర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ కూడా లవ్ జిహాద్ పేరుతో ముస్లిం తీవ్రవాద సంస్థలు పాల్పడుతున్న అకృత్యాలపై ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వాస్తవిక ఘటనలను తెరకెక్కిస్తామని ది కేరళ స్టోరీ రూపకర్తలు ప్రకటించడంతో అది దేశ రాజకీయాల్లో, భారతీయ సమాజంలో ఇంకెన్ని ప్రకంపనలు రేపుతుందోనన్న చర్చ జరుగుతోంది.