Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఏపీ సిఎం వైఎస్ జగన్ తో భేటీ కోసం సినీ పెద్దలు అందరూ కదిలి వస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ సమస్య పరిష్కారం కోసం అందరూ ఒక్కటై కదిలి వస్తున్నారు. రాజకీయంగా, సినిమాపరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న టికెట్ ధరల విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సినీ ప్రముఖులు… జగన్ తో భేటీకి సర్వం సిద్దం చేసుకున్నారు.
సీఎం ను కలవడానికి చిరంజీవి, నాగార్జున సహా పలువురు దర్శకులు,నిర్మాతలు వస్తున్నారని ఇప్పటి వరకు వార్తలు వచ్చినా… మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి వంటి ప్రముఖులు వస్తున్నారు. వీరితో పాటుగా రవితేజా కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతున్న నేేేపథ్యంలో సినీ పరిశ్రమతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎం తో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
సినిమా టికెట్ల ధరల పెంపు పై ఇప్పటికే అధ్యయన నివేదికను కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కమిటీ ప్రతిపాదనలపై సినీ ప్రముఖులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న సీఎం… టికెట్ ధరలను పెంచుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో కొందరు రెచ్చగొట్టే ధోరణి తో మాట్లాడినా సరే వీరు మాత్రం… సమస్యను సున్నితంగానే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ కూడా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వసతుల కల్పన ఆధారంగా టిక్కెట్ ధరలు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లలో కనీస ధర 40 రూపాయలు, గరిష్ఠ ధర 150 రూపాయలుగా సిఫార్సు చేశారు. ఎయిర్ కూల్ థియేటర్లకు కనీస ధర 40 రూపాయలు, గరిష్ఠ ధర 120గా సూచించారు. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర 30 రూపాయలు, గరిష్ఠ ధర 70 రూపాయలుగా సూచించారు. సినిమా టిక్కెట్ ధరలు పై గురువారం హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు విచారణ కూడా జరగనుంది.
Also Read : టికెట్ రేట్ల సమస్యకు శుభం కార్డు.. మూడో వారంలో జీవో : చిరంజీవి