భర్త చనిపోయి, బిడ్డకి ఏకైక సహజ సంరక్షకురాలిగా మారిన తల్లికి, ఆ బిడ్డ ఇంటిపేరును ఎంచుకునే హక్కుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మళ్ళీ పెళ్ళి చేసుకున్నా ఆ తల్లికి హక్కు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. బిడ్డ ఇంటి పేరు విషయమై ఒక మహిళ, ఆమె అత్తామామల మధ్య కొనసాగుతున్న కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది.
పిటిషనర్ భర్త 2006లో చనిపోయాడు. అప్పుడు ఆమె బిడ్డ వయసు రెండున్నరేళ్ళు. 2007లో ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుంది. 2008లో ఆ మహిళ అత్తామామ మైనర్ అయిన బిడ్డకి, తమనే గార్డియన్స్ గా నియమించాలంటూ కింది కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. బిడ్డకి అసలు తండ్రి ఇంటిపేరే ఉంచాలంటూ హైకోర్టు తల్లికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే బిడ్డకి సంబంధించిన రికార్డుల్లో వీలున్న చోటల్లా అసలు తండ్రి పేరు నమోదు చేయించాలని, అలా కుదరకపోతే సవతి తండ్రి పేరు రాయించి అది సవతి తండ్రి పేరనే విషయాన్ని ప్రస్తావించాలని చెప్పాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును ఆ మహిళ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉన్నప్పుడు బిడ్డ ఇంటి పేరును ఎంపిక చేసుకునే హక్కు ఆ తల్లికే ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆ సంతానాన్ని దత్తతకిచ్చే హక్కు కూడా తల్లికే ఉంటుందని ఇద్దరు సభ్యులతో కూడిన ద్విసభ్య బెంచ్ వెల్లడించింది.
ఇంటి పేరు గురించి సుప్రీం కోర్టు ఏమంది?
ఇంటిపేరు అనేది కుటుంబం మొత్తాన్నీ ఒకే గాటన కట్టి ఉంచుతుంది. ఇంటి పేరు అనేది వారసత్వానికి గుర్తింపు. అంతే కాదు సమాజంలోనూ అది కీలక పాత్ర పోషిస్తుంది. ఒకే ఇంటి పేరు ఉండడం కుటుంబ వ్యవస్థకు కీలకం. ఇంటి పేరు సంతానానికి ఒక ఉనికిని ఇస్తుంది. అయితే ఆ బిడ్డ ఇంటి పేరు, ఇతర కుటుంబీకుల ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే, అది ఆయా సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. తను వేరు అన్న భావనను బిడ్డలో కలిగిస్తుంది. అందుకే తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాక తన భర్త ఇంటి పేరును ఆ బిడ్డకు పెట్టడంలో గానీ, తన భర్తకు ఆ బిడ్డను దత్తత ఇవ్వడంలో గానీ తప్పేమీ లేదని అత్యున్నత న్యాయస్థానం వివరించింది.