iDreamPost
android-app
ios-app

పూజా రెండు పడవల ప్రయాణం

  • Published Nov 02, 2020 | 12:34 PM Updated Updated Nov 02, 2020 | 12:34 PM
పూజా రెండు పడవల ప్రయాణం

ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. అల్లు అర్జున్ తో డీజే చేయక ముందు తన పరిస్థితి వేరు. ఎంట్రీ ఇచ్చిన మూడు భాషల్లో డిజాస్టర్లు స్వాగతం చెప్పాయి. తమిళంలో మాస్క్, తెలుగులో ముకుందా, హిందీలో మొహేంజదారో దేనికవే తీవ్ర నిరాశాజనక ఫలితాలు అందుకున్నాయి. అందుకే 2012లో కెరీర్ మొదలుపెట్టినా స్పీడ్ అందుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత నాగ చైతన్యతో చేసిన ఒక లైలా కోసం కూడా సోసోగానే ఆడింది. దాని వల్ల కొంత గ్యాప్ వద్దన్నా తీసుకోక తప్పలేదు. దేనికైనా కాలం ఖర్మం కలిసి రావాలి కదా.

అలా ఎదురుచూశాక 2017లో దువ్వాడ జగన్నాధంలో దర్శకుడు హరీష్ శంకర్ తనను చూపించిన విధానం ఇతర హీరోలు పూజా వైపు చూసేలా మార్చింది. అదేమీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా పూజా మాత్రం దెబ్బకు స్టార్ అయిపోయింది. రంగస్థలంలో ఐటెం సాంగ్ చేశాక అటుపై అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో వరస బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లతో కెరీర్ గ్రాఫ్ అమాంతం ఎగబాకింది. మధ్యలో సాక్ష్యం లాంటి దెబ్బలు ఉన్నా అవేవి ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధమవుతుండగా రాధే శ్యామ్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇక్కడ ఎంత డిమాండ్ ఉన్నా పూజా హెగ్డేకు బాలీవుడ్ మోజు మాత్రం తీరలేదు. అందుకే గత ఏడాది మల్టీ స్టారర్ హౌస్ ఫుల్ లో సింగల్ హీరోయిన్ కాకపోయినా ఒప్పుకుని మరీ సక్సెస్ దక్కించుకుంది. త్వరలో రోహిత్ శెట్టి తీయబోయే సర్కస్ షూటింగ్ లో పాల్గొనబోతోంది. సల్మాన్ ఖాన్ తో ఓ ప్రాజెక్ట్ కూడా దాదాపు ఓకే అయినట్టే. తనకు హిందీ సినిమాలంటే ఎంత ఇష్టమంటే బాగా ఏజ్ బార్ హీరోలైనా అక్షయ్ కుమార్, సల్మాన్ లాంటి వాళ్ళతో జట్టు కట్టేందుకు కూడా ఆలోచించడం లేదు. ఇక్కడ ఎంత టెంప్టింగ్ రెమ్యునరేషన్లు వస్తున్నా ముంబై స్టార్లతో చేస్తే వచ్చే కిక్కే వేరు కాబట్టి రెండు పడవల ప్రయాణం మాత్రం వదిలేలా లేదు