iDreamPost
android-app
ios-app

చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డుతున్న‌ట్టే.. పీఎస్ ఇంట్లో భారీగా దొరికింది

  • Published Feb 13, 2020 | 3:13 PM Updated Updated Feb 13, 2020 | 3:13 PM
చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డుతున్న‌ట్టే.. పీఎస్ ఇంట్లో భారీగా దొరికింది

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌లు రెట్టింప‌వుతున్నాయి. తాజాగా ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్న త‌రుణంలో తీగ‌లాగితే డొంకంతా క‌దిలిన చందంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు టీడీపీని మ‌రింత ఇర‌కాటంలో నెట్టే ప‌రిస్థితి దాపురించ‌డం ఆపార్టీని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఏపీలో త‌న వ్య‌వ‌హారాలు ముగించుకుని అర్థాంత‌రంగా హైద‌రాబాద్ ప‌య‌నం కావడంతో ఏం జ‌రుగుతుందోన‌నే సందేహాలు పెరుగుతున్నాయి. సుదీర్ఘ‌కాలం పాటు చంద్ర‌బాబు పీఎస్ గా శ్రీనివాస్ ఇంట్లో నాలుగు రోజుల పాటు సాగిన సోదాల్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డుల‌ను ప‌రిశీలిస్తే పెద్ద చేప‌లే దొరికే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

తాజాగా ఐటీ అధికారులు అధికారికంగా ఆ సోదాల‌కు సంబంధించిన ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పూణే నగరాల్లో జ‌రిపిన దాడుల్లో కీల‌క ఆధారాలు దొరికిన‌ట్టు వెల్ల‌డించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3 ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీల గుట్టు రట్టయిన‌ట్టు తెలుస్తోంది. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ వాటి ఆధారంగా చ‌ర్య‌లు చేప‌డితే చాలామందికి చుట్టుకుంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ మెయిళ్లు, వాట్సాప్ మెస్సేజుల ద్వారా చేసిన లావాదేవీలు, విదేశీ లావాదేవీలు కూడా జ‌రిగిన‌ట్టు ఐటీ గుర్తించింది. చంద్ర‌బాబు సీఎస్ ఇంటిపై జ‌రిగిన దాడుల్లో ల‌భించిన ఆధారాలు కీల‌కంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించి పెద్ద మొత్తంలో స్వాహా చేసి ఉంటార‌ని సందేహిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు లెక్క‌లేస్తున్న నేప‌థ్యంలో వ్య‌వ‌హారం సీరియ‌స్ గా మారుతున్న‌ట్టు తెలుస్తోంది.

పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధుల దారి మళ్లింపు జ‌రిగింద‌ని ఐటీ చెబుతోంది.

బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని ఐటీ గుర్తించ‌డం ఆస‌క్తిగా మారుతోంది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తీరు ఆధారాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డంతో ఐటీ ఉచ్చు నుంచి ఇక త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు గుర్తించిన నేప‌థ్యంలో మ‌నీ ల్యాండ‌రింగ్ స‌హా ప‌లు చ‌ట్టాలు ప్ర‌యోగించినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అంచ‌నా వేస్తున్నారు. సుదీర్ఘ స‌మ‌యం పాటు సాగించిన సోదాల్లో రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల విలువ చేస నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసిన నేప‌థ్యంలో మ‌రిన్ని ఆధారాలు దొరికే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

దాంతో ఈ ప‌రిణామాలు చంద్ర‌బాబుని పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్రంలో పెద్ద‌లు చంద్ర‌బాబు తీరు ప‌ట్ల గుర్రుగా ఉన్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటు దారితీస్తాయన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ వ్య‌వ‌హారం చంద్ర‌బాబు మెడ‌కు చిక్కుకుంటూ ఏపీ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా వేడెక్కే అవ‌కాశం ఉంది.