iDreamPost

Mohan Lal : మోహన్ లాల్ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది

Mohan Lal : మోహన్ లాల్ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది

మళయాలంలో దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ డం అనుభవిస్తున్న మోహన్ లాల్ మార్కెట్ ఎంతటిదో మన ప్రేక్షకులకు సైతం అవగాహన ఉంది. దృశ్యం, లూసిఫర్, పులి మురుగన్ లాంటి చిత్రాలు కేరళ లాంటి చిన్న రాష్ట్రంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించాయి. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఓటిటికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఇప్పటికే మరక్కర్ లయన్ అఫ్ ది అరేబియన్ సీని అమెజాన్ ప్రైమ్ కి డీల్ చేసుకోగా మరో మూడు సినిమాలు కూడా అదే బాటలో ఉన్నాయట.

12త్ మాన్, బ్రో డాడీ, అలోన్ లను డైరెక్ట్ ఓటిటికి ఇస్తున్నట్టు ఆ కంప్లీట్ యాక్టర్ సన్నితుడు నిర్మాత ఆంటోనీ పెరంబూరు నేరుగా మీడియా ముందు ప్రకటించడం సంచలనం రేపుతోంది. దానికి కారణాలు లేకపోలేదు. కేరళలో థియేట్రికల్ రిలీజ్ కు ఓటిటి మధ్య 21 రోజుల గ్యాప్ ఉండేలా ఒప్పందం చేసుకుందామని ఆంటోనీ అనుకున్న ప్రతిపాదనను పంపిణీదారులకు చెప్పారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అలా చేస్తే తాము డిస్ట్రిబ్యూట్ చేయమని బెదిరించారు. దీంతో ఆపసోపాలు పడి హాళ్లలో విడుదల చేయడం కంటే పెట్టుబడి మీద లాభం వచ్చే ఓటిటికి ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఎక్కువని గుర్తించి ఇలా నిర్ణయించుకున్నారు.

ఎంతలేదన్నా ఈ నాలుగు సినిమా బిజినెస్ వేల్యూ 200 కోట్లకు పైగానే ఉంటుంది. ఇదంతా థియేటర్ వర్గాలు కోల్పోతాయి. తాను ఎన్ని సార్లు చర్చలు జరిపినా డిస్ట్రిబ్యూటర్లు మాట వినడం లేదని అందుకే నిర్మాతగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు తనకు ఉందని ఆంటోనీ అంటున్నారు. ఊహించని ఈ పరిణామం మల్లువుడ్ ని సైతం షాక్ కు గురి చేసింది. ఇలా అయితే అందరూ డిజిటల్ వైపే వెళ్తారని అప్పుడు థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు కాకుండా మరో మోహన్ లాల్ సినిమా కూడా ఓటిటి వైపే చూస్తోందట. ఇలా అయితే ఈ లెజెండరీ యాక్టర్ ని ఇకపై బిగ్ స్క్రీన్ పై చూడలేమేమో

Also Read : Duniya Vijay : బాలయ్య సినిమా కోసం శాండల్ వుడ్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి