iDreamPost
android-app
ios-app

హంద్వారా ఘటనలో సైనికుల త్యాగం మరువలేనిది – ప్రధాని మోదీ

హంద్వారా ఘటనలో సైనికుల త్యాగం మరువలేనిది – ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌లో స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్‌కౌంట‌ర్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం వారు ప్రాణాలను పణంగా పెట్టి అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు,స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

కుప్వారా జిల్లాలోని చంజ్‌ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం శనివారం ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ముందుగా ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. కానీ ఉగ్రవాదులు ఒక ఇంటిని ఆక్రమించి అందులోని వారిని బంధీలుగా తీసుకున్నారు.

ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టారు. దీంతో భద్రతా దళాలపై ఒక్కసారిగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర మూకల కాల్పులలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న మేజర్‌ కల్నల్‌ అశుతోష్‌ శర్మతో పాటు ఒక ఎస్సై, ముగ్గురు సైనికులు కూడా వీరమరణం పొందారు. అశుతోష్‌ శర్మ 21 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ప్రపంచమంతా కరోనాపై పోరులో నిమగ్నమయి ఉంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం భారత్‌లో చొరబడి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో తిష్టవేసిన ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించేందుకు పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పదే పదే ఉల్లంఘిస్తుంది.