iDreamPost
android-app
ios-app

యనమల.. తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పు అవుతుందా..?

యనమల.. తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పు అవుతుందా..?

టీడీపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ నేతలు మేథావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలపై అరెస్ట్‌పై స్పందించారు. తన భాష ప్రావిణ్యాన్ని ఉపయోగించి ప్రాసలతో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్‌ ఒక తప్పు, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌ మరో తప్పు, జేసీ అస్మిత్‌ రెడ్డి అరెస్ట్‌ ఇంకో తప్పు.. అంటూ ప్రాసలతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు యనమల.

తమ పార్టీ నేతలను అరెస్ట్‌ చేయడం తప్పు అని యనమల భావించడంలో తప్పు లేదు. కానీ అచ్చెం నాయుడును ఏసీబీ ఎందుకు అరెస్ట్‌ చేసిందో యనమల తన ప్రకటనలో పేర్కొనకపోవడం తప్పు. అచ్చెం నాయుడు తప్పు చేయలేదని తన ప్రకటనలో యనమల పేర్కొనకపోవడం మరో తప్పు. తప్పును సమర్థించడం ఇంకో తప్పు అని మేధావి యనమలకు తెలియదనుకోవడానికి లేదు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేశారు..? కారణాలు లేకుండానే అరెస్ట్‌ చేస్తారా..? అనే ఆలోచన యనమల చేయకపోవడం తప్పు. బీఎస్‌ 3 వెహికల్స్‌ను బీఎస్‌ 4గా మార్చడం తప్పు కాదని యనమల భావించడం మరో తప్పు. నకిలీ ఎన్‌వోసీలను సృష్టించడం, ఇన్సూ్యరెన్స్‌ చేయకుండానే చేసినట్లు చూపడం తప్పు కాదని యనమల అనుకోవడం ఇంకో తప్పు.

తప్పులను సరిదిద్దుకోమని తమ పార్టీ నేతలకు సీనియర్‌ అయిన యనమల మందలించకపోవడం తప్పు. ప్రభుత్వం మనది కాదు, మన ప్రభుత్వం ఉన్న సమయంలో చేసినట్లుగా ఇప్పుడు తప్పులు చేయకూడదని పెద్దలుగా సలహాలు, సూచనలు ఇవ్వకపోవడం మరో తప్పు. ఇలా చేయకుండా.. తప్పు చేసిన తమ పార్టీ నేతలను వెనకేసుకు రావడం ఇంకో తప్పుగా యనమలకు అనిపించలేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.