అడ్డుకునేది.. అంతమొందించేందుకేనా వెంకన్న ..?

రాజకీయాల్లో స్వామి భక్తి సర్వ సాధారణం. తమ అధినేతలపై పలువురు విపరీతమైన స్వామి భక్తి చూపిస్తారు. అవి చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటాయి కానీ రాజకీయాల్లో ఇలాంటి లేకపోతే రాణించడం కష్టం. అధినేతలు కూడా అలాంటి స్వామి భక్తినే కోరుకుంటారు. వీరూ రెచ్చిపోతారు. ఈ కోవకే చెందుతారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్‌లపై ఎనలేని భక్తిని చూపిస్తుంటారు. ఆయన భక్తి చూస్తే నవ్వొస్తుంటుంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ఏకంగా శాష్టాంగ నమస్కారం చేశారు. అంతేకాదు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు వినతిప్రతం ఇవ్వడం లాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో బుద్ధా వెంకన్న చేశారు.

చంద్రబాబు, లోకేష్‌లపై ఈగ కూడా వాలనివ్వనన్నట్లుగా వెంకన్న ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన చూస్తే వెంకన్న తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, నారా లోకేష్‌లను అంతమొందించేందుకు వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నుతోందట. విశాఖలో చంద్రబాబుపై, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, పోలీసులకు వారిని అడ్డుకునే బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.

విశాఖ, సీతానగరం ఘటనలపై అవగాహన లేని వారు వెంకన్న మాటలు వింటే నిజంగా చంద్రబాబు, లోకేష్‌లను అంతమొందించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారా..? అనే సందేహం తప్పక కలుగుతుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. విశాఖ కార్యనిర్వాహఖ రాజధానిగా చేసేందుకు మద్ధతు తెలపాలని కోరుతూ ఉత్తరాంద్ర వాసులు, ప్రజా సంఘాలు విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నాయి. తమ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారనేదే వారి ఆవేదనకు కారణం. అలాగే సీతానగరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సేకరించిన భూమికి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని రైతులు అడ్డుకున్నారు. గోదావరికి కుడి వైపున్నపట్టిసీమ పథకంలో ఒకవిధంగా ,ఎడమ వైపున్న పురుషోత్తపట్నం పథకానికి భూమిలిచ్చిన రైతులకు మరోలా పరిహారం ఇవ్వడంపై వారు కోర్టులను కూడా ఆశ్రయించారు. అప్పటికే పుష్కర ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పోయిన వారు పురుషోత్తపట్నం పథకం వల్ల ఉన్న అంతో ఇంతో భూమి కూడా కోల్పోయారు. అందుకే వారిలో దాగి ఉన్న ఆవేదన.. ఆగ్రహం రూపంలో పెల్లుబికింది.

తమ, తమ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ప్రజలు వ్యతిరేకిస్తారు. వారు తమ ప్రాంతానికి వస్తే నిరసన తెలుపుతారు తప్పా వెంకన్న చెబుతున్నట్లు అంతమొందించరు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకన్న ఇలాంటి ప్రకటనలు చేయడం హాస్యాస్పదం. స్వామి భక్తి చాటుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఆ దారిలో వెళ్లడం ఉత్తమం.

Show comments