నాకు మైకు ఇవ్వడం లేదన్న అధికార పార్టీ ఎమ్మెల్యే

అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా తనకు మైక్‌ ఇవ్వడంలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడంతో కోటం రెడ్డి తన ఆవేదనను నిండు సభలో వెల్లగక్కారు. కోటం రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే…

‘‘ గతంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండేవాడిని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోరాడి మైక్‌ సాధించేవాడిని. మైక్‌ ఇవ్వకపోతే పోడియం వద్దకు వచ్చిన గొంతుపోయేలా అరచి మైక్‌ సంపాధించేవాడిని. ఇదేమి విచిత్రమో తెలియదు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మైక్‌ రావడం లేదు. నా పేరు రాసేందుకు మా చీఫ్‌ విప్‌ (గడికోట శ్రీకాంత్‌ రెడ్డి)కి చేతులు వచ్చినట్లుగా లేదు. ఎందుకో మీ వైపు చూస్తు చేయి ఎత్తుతున్నా నాకు అవకాశం ఇవ్వడంలేదు. తొమ్మిది నెలలుగా ఇలానే ఉంది. నా ముందుగా మా పార్టీ నుంచి ఏడెనిమిది మంది సభ్యులు మాట్లాడుతున్నప్పుడు కూడా చేయి ఎత్తుతున్నాను. ఈ రోజు ఎట్టకేలకు మీరు స్పందించి మైక్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని కోటం రెడ్డి అన్నారు.

ఓ ప్రబుద్ధుడు నాకు నీతులు చెప్పాడు…

‘‘ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు వైఎస్‌ జగన్‌ను అప్పటి మంత్రులు అచ్చెంనాయుడు, ఉమా మహేశ్వరావులు.. మగాడివైతే, సీమ రక్తం అయితే రా చూసుకుందా.. ఖబడ్ధార్‌ అంటూ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మా కడుపులో ఆ బాధ ఉండడంతో అవన్నీ గుర్తు చేస్తూ నేను ఖబడ్దార్‌ అంటూ చంద్రబాబును అన్నాను. అంతే తప్పా మరే ఉద్దేశం లేదు. ఆ సమయంలో మా పార్టీకి చెందిన ఓ ప్రబుద్ధుడు నన్ను పిలిచి నీతులు చెప్పాడు’’ అని కోటం రెడ్డి సొంత పార్టీ నేతపై ఫైర్‌ అయ్యారు.

ఆవేశపరులు కుట్రదారులు కాదు..

’’ అందుకే ఏది మాట్లాడాలో తెలియక ఇంత గందరగోళం జరుగుతున్నా నా సీట్లునే కూర్చుని మౌనంగా ఉన్నాను. నాకు ఆవేశం జాస్తి. ఆవేశానికి అర్థం ఉంటుంది. ఆవేశపరులు ఎప్పుడూ కూడా కుట్రదారులు కాదు. ఆవేశపరులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి, అధినేతకు విధేయులుగా ఉంటాం. ఎక్కడైనా ఒకే మాటపై ఉంటాం. కుట్రదారులైతే ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకుడి కాళ్లకు దండాలు పెడతారు. ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు’’ అని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు.

కాగా, శ్రీధర్‌ రెడ్డి ప్రశంగం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మంచి స్పీకర్‌గా, సబ్జెక్ట్‌ ఉన్న నేతగా పేరొందిన శ్రీధర్‌ రెడ్డికి మైక్‌ ఎందుకు ఇవ్వడంలేదన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అనేక ప్రభుత్వ పథకాలు, చట్టాలు సభలో ప్రవేశపెట్టిన సమయంలో వాటిని ప్రజలకు చేరేలా… సరళమైన భాషలో కోటం రెడ్డి మాట్లడగలరని, అయినా అధికార పార్టీ కావాలనే శ్రీధర్‌ రెడ్డిని పక్కన పెట్టిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతోపాటు తమ పార్టీలోని ఓ ప్రబుద్ధుడు తనకు నీతులు చెప్పాడని బాంబు పేల్చడంతో.. ఆ నేత ఎవరన్నది..? ఎవరికి వారు ఇటీవల జరిగిన పరిమాణాలను గుర్తు చేసుకుంటూ అంచనా వేసుకుంటున్నారు.

Show comments