Idream media
Idream media
టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ తరఫున మంత్రిగా, ఎంపీగా పని చేసి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి, తనపై నమ్ముకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే పార్టీలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడంతో… ఇప్పుడు ఓ సందేహం మొదలైంది. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులను తాము ప్రోత్సహించబోమని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఈ మాటకు కట్టుబడి ఉన్నారు. ఒక వేళ ఎవరైనా పార్టీలో చేరాలని ఆసక్తి చూపితే ఎమ్మెల్యే, ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తేనే చేర్చుకుంటామన్నారు.
టీడీపీ తరఫున గత ఎన్నికల్లో 23 మంది గెలిచారు. వీరిలో ఇప్పటికే ఇద్దరు ఆ పార్టీకి దూరమయ్యారు. గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరిధర్‌లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. వీరి కలయిక చాలా సాధారణంగా జరిగింది. ఎమ్మెల్యేలు తాము ఒక్కొరిగానే వెళ్లి వైఎస్ జగన్‌ను కలిశారు. అనుచరులను తీసుకెళ్లలేదు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. పార్టీ కండువా కప్పుకోలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామంటూ చెప్పి ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీలో కూడా వారిద్దరూ అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం వైపున కాకుండా వేరుగా కూర్చుంటున్నారు.
వీరిరువురకు భిన్నంగా కరణం బలరాం వ్యవహరిస్తున్నారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తన తనయుడు 2014లో అద్ధంకి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కరణం వెంకటేష్, ముఖ్యనేతలు, భారీగా అనుచరగణంతో కలసి సీఎం వద్దకు వెళుతున్నారు. మరి ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటారా..? లేదా తనయుడు కరణం వెంకటేష్ మాత్రమే కండువా కప్పుకుంటారా..? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఒక వేళ కరణం అధికారికంగా పార్టీలో చేరాలని భావిస్తే.. పార్టీ కండువా కప్పుకుంటారు. అలా అయితే.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
చీరాలలో ఉప ఎన్నికలు అనివార్యమైతే.. టీడీపీకి స్థానికంగా అభ్యర్థి కూడా దొరికే అవకాశం లేదు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆ మంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి పోటీ చేశారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల సునీత ఆ తర్వాత టీడీపీ తరఫునే ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇప్పుడు కరణం బలరాం కూడా అధికార పార్టీలో చేరుతున్నారు. గతంలో టీడీపీ హాయంలో మంత్రిగా పని చేసిన పాలేటి రామారావు కూడా కరణంతోపాటు సీఎంను కలిసేందుకు వెళుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చీరాలలో అభ్యర్థే లేరని చెప్పవచ్చు.