రాజధానిపై వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే భిన్నస్వరం

ఆంద్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న చర్చలో కొత్త ట్విస్ట్ నెలకొంది. మూడు రాజధానులపై ఇటీవల అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ప్రకటన చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రెండూ ఒకే చోట ఉండాలని గుంటూరు జిల్లా నరసారావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తాజా అయన మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

అసెంబ్లీ, సచివాలయం రెండూ అమరావతి లోనే ఉండాలన్నారు. పరిపాలన అంతా ఒకచోట నుంచి చేస్తే బాగుంటుందన్నారు. వైజాగ్ ను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు.

నిపుణుల కమిటీ త్వరలో నివేదిక ఇస్తోందని, తన ఆలోచనలను సీఎం జగన్ తో చర్చిస్తానని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. కాగా, సీఎం ప్రకటన పై ఇప్పటికే స్పష్టత రాని పక్షంలో తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో రాజధాని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show comments