iDreamPost
android-app
ios-app

స్పీకర్ తమ్మినేనితో గంటా చర్చలు

  • Published Mar 25, 2021 | 1:42 PM Updated Updated Mar 25, 2021 | 1:42 PM
స్పీకర్ తమ్మినేనితో గంటా చర్చలు

మాజీమంత్రి, టీడీపీ విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆమదాలవలస పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. గురువారం మధ్యాహ్నం ఆయన విశాఖ నుంచి నేరుగా ఆమదాలవలస వెళ్లి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో భేటీ అయ్యారు. స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఇరువురు కూర్చొని చర్చించుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. తన రాజీనామా అంశాన్ని గంటా ప్రస్తావించారని.. పరిశీలిస్తానని చెప్పానని వివరించారు.

రాజీనామాపైనే చర్చ

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారికంగా కేంద్రం చర్యలు ప్రారంభించిన తర్వాత రాజీనామా ఆమోదించాలని స్పీకర్ కార్యాలయానికి పంపిన రాజీనామా లేఖలో కోరారు. అది ఏక వాక్యంతో లేకపోవడం, షరతులు కూడా ఉండటంతో.. ఫార్మెట్ లో పంపాలని కోరుతూ స్పీకర్ తిప్పిపంపారు. దాంతో గంటా స్పీకర్ ఫార్మెట్ లో మళ్లీ రాజీనామా పంపిన విషయం తెలిసిందే. ఆ రాజీనామా ఆమోదించాలని కోరేందుకే గంటా స్పీకర్ ను కలిసినట్లు స్పష్టమైంది. రెండో రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరింది. అది ప్రస్తుతం ఆయన పరిశీలనలో ఉంది. స్పీకర్ దాన్ని ఆమోదించి నోటిఫై చేస్తే.. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఖాళీ అవుతుంది. ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అందుకే దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని భావిస్తున్నారు.

పాత మిత్రులం కలిశాం..

తనతో టీడీపీ ఎమ్మెల్యే గంటా భేటీపై స్పీకర్ తమ్మినేని స్పందించారు. ఇది మర్యాదపూర్వక కలయికేనని స్పష్టం చేశారు. ఇద్దరం పాట మిత్రులం.. గతంలో టీడీపీలోను, ప్రజారాజ్యంలోనూ కలిసి పనిచేశామని.. అందుకే గంటా గౌరవపూర్వకంగా వచ్చి కలిశారని తమ్మినేని వివరించారు. ఈ సందర్భంగా గంటా తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించారని నిర్ధారించారు. ఫార్మెట్ లో పంపిన రాజీనామా లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పానని తమ్మినేని వెల్లడించారు.

టీడీపీ ఆరా

కాగా గత ఎన్నికల నాటి నుంచి పార్టీకి, అధినేతకు దూరంగా ఉంటున్న గంటా కదలికలపై టీడీపీ ఆరా తీస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని రాజకీయంగా వెలుగులోకి రావాలని భావిస్తున్న గంటా.. పార్టీ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా అధినేత చంద్రబాబుకు చెప్పకుండానే రాజీనామా చేశారు. ఉక్కు పరిరక్షణ పేరుతోనే ఆమధ్య తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను, రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. తాజాగా స్పీకర్ భేటీ కావడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది.

Also Read : టీడీపీ క్యాడర్ తలోదారి, బాబు మీద విశ్వాసం కోల్పోయిన కార్యకర్తలు