iDreamPost
iDreamPost
ఒక పాటకో లేదా సినిమాకో యుట్యూబ్ లో కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినంత మాత్రాన దాన్ని ప్రాతిపదికన అది అత్యుత్తమం ఆమోదయోగ్యం అని చెప్పడానికి లేదు. ఒకవేళ అందులో ఏదైనా తప్పున్నా దోషమున్నా ఖచ్చితంగా దాన్ని వేలెత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో సినిమా నుంచి సామజవరగమనా పాట గురించిన చర్చ జరుగుతోంది. ఎందుకంటారా. కారణం ఉంది.
సామజవరగమనా త్యాగరాయ కృతి. అందులో ఎంతో నిఘూడమైన సారాంశం ఉంది. ముఖ్యంగా సామజవరవరగమనా అంటే ఏనుగు లాంటి దర్పం గంభీరమైన నడక కలవాడా అనే అర్థం వస్తుంది. కాని సినిమాలో వాడుకున్న సందర్భం వేరు. అమ్మాయి కాళ్ళు తొడలు చూసి ప్రేమలో పడిన హీరో తన హీరొయిన్ ని ఊహించుకుంటూ వేసుకునే డ్రీం సాంగ్ అది. స్టెప్పులు కూడా భలే విచిత్రంగా ఉంటాయి.
సంగీత సాహిత్య ప్రియులు ఇక్కడే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కృతిని ఇలా ఎలా వాడుకుని భ్రష్టు పట్టిస్తారని అంటున్న వాళ్ళు లేకపోలేదు. దానికి తోడు సినిమా గీత సాహిత్యంలో లబ్దప్రతిష్టులు అనదగ్గ సిరివెన్నెల సితారామశాస్త్రి గారు ఇది రాయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారాన్ని సమర్ధిస్తున్న వాళ్ళు లేకపోలేదు. సినిమా అనేది కళతో చేసే వ్యాపారమని అందులో భాగంగా ఇలాంటివి జరుగుతుంటాయని ప్రతిది భూతద్దంలో చూడకూడదని అంటున్నారు.
ఏదేమైనా సామజవరగమనా కృతి ఇలా అమ్మాయిని వర్ణించడానికి వాడుకోవడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో బాలకృష్ణ టాప్ హీరో సినిమాలో, వంశీ లాయర్ సుహాసిని సినిమాలోనూ ఇదే తరహాలో వాడుకున్నారు. శంకరాభరణంలో మాత్రమే సందర్భశుద్ధిగా వస్తుంది. అయితే ఈ పాట ఇంత పెద్ద హిట్ అయినా ఇందులో సాహిత్యం గురించి సిరివెన్నెల వారు ఎక్కడా కనీసం వివరణ కాని దాని గురించి ప్రస్తావించడం కాని చేయకపోవడం గమనార్హం