iDreamPost
android-app
ios-app

రెండు రోజులకే కలకలం

రెండు రోజులకే కలకలం

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగి వారం రోజులు కూడా కాకముందే “మహా వికాస్ అఘాడి” సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కకపోవడం పై అసంతృప్తికి గురైన శివసేన ఏకైక ముస్లిం మంత్రి అబ్దుల్ సత్తార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మంత్రిగా ప్రమాణం చేసి ఐదు రోజులు దాటినా తనకు శాఖ ను కేటాయించకపోవడంపై సత్తార్ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాకరే కి పంపారని మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో తన రాజీనామా పై అబ్దుల్ సత్తార్ ఇప్పటి వరకు బహిరంగా ప్రకటన చెయ్యలేదు. అయితే సత్తార్ రాజీనామా వార్తలను ఠాక్రే కుటుంబం ఖండించింది.

కేబినెట్‌ బెర్త్ కోసం ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక పోవడంతో వారిని బుజ్జగించడం సంకీర్ణ పక్షంలోని మూడు పార్టీలకు పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. కేబినెట్ తుది కూర్పు కోసం మూడు పార్టీలు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపినప్పటికీ పూర్తి స్థాయిలో ఆశావాహులని సంతృప్తి పరచలేకపోతున్నాయి. ఇదే సమయంలో సత్తార్ రాజీనామా వ్యవహారం శివసేన కి మరింత తలనొప్పిగా మారింది. ఔరంగాబాద్ పరిధిలోని సిల్లోడ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్ గతంలో కొద్ది కాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన తనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక బీజేపీ నాయకులు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో శివసేన కండువా కప్పుకున్నారు.

సత్తార్ రాజీనామా లేఖ ఇప్పటివరకు సిఎం ఉద్ధవ్ థాకరే కార్యాలయానికి ఇంకా అందలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సత్తార్ తన రాజీనామా లేఖను పార్టీ కార్యదర్శి, యంపీ అనిల్ దేశాయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే సేన రాజ్యసభ ఎంపి అనిల్ దేశాయ్ మాత్రం తనకి అబ్దుల్ సత్తార్ నుండి ఎటువంటి లేక అందలేదని మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అయితే ఆశ్చర్యంగా అబ్దుల్ సత్తార్ కుమారుడు సమీర్ నబీ మాత్రం తన తండ్రి మంత్రి వర్గానికి రాజీనామా చేసినట్టు వస్తున్నవార్తల్లో నిజం లేదని రాజీనామా వదంతులని కొట్టి పారేయడం విశేషం. అయితే ఈ పరిణామాలతో సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడప్పుడే వచ్చిన ప్రమాదం ఏమి లేదని చెప్పవచ్చు.