పేదలను ఆదుకోవటంలో జగన్ ది కమ్యూనిస్ట్ శైలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కమ్యూనిస్టుల దారిలో వెళుతున్నారా..? వారి పంథాను వైసీపీ ప్రభుత్వాధినేత అవలంభిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ప్రజా సంక్షేమంలో కమ్యూనిష్టుల విధానాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అచారిస్తున్నారని పేర్ని నాని కొనియాడారు.

సాధారణ సమయంలోనే కాక ఆపత్కాలంలోనూ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం వైఎస్‌ జగన్‌ తన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నారనేది నాని ఉద్దేశం. రైతు భరోసా, నేతన్న చేనేత హస్తం, అమ్మ ఒడి వంటి పథకాలతో ప్రజల్లో ఆర్థిక అంతరానికి జగన్‌ కృషి చేస్తున్నారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తొలగించడం అనేది కామ్రేడ్‌ల విధానాల్లో ఒకటి. సీఎం వైఎస్‌ జగన్‌ కమ్యూనిస్టుల విధానాలను ఆచరిస్తూ ప్రజలకు మంచి చేస్తుంటే.. రాష్ట్రంలోని కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారనేది నాని ప్రధాన అభ్యంతరం.

కరోన వైరస్‌ వ్యాపిస్తుండడంతో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రభుత్వం చేతనైన సహాయం చేస్తోంది. రేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం, కార్డుకు మూడు కేజీ కందిపప్పు మూడు దశల్లో అందిస్తోంది. దానితోపాటు కార్డుదారులుకు ఇతర అవసరాల కోసం వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తోంది. రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలకు 1300 కోట్ల రూపాయల సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి వాలంటీర్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు.

అయితే.. పేదలకు వెయ్యి రూపాయలు అందించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతోపాటు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే పోనీ.. అనుకున్నా ప్రజల తరఫున పోరాటాలు చేసే కామ్రేడ్‌లు కూడా పేదలకు మంచి జరగడంపై అభ్యంతరాలు తెలపడంతోనే నాని కామ్రేడ్‌ రామకృష్ణపై ఫైర్‌ అయ్యారు.  

Show comments