iDreamPost
android-app
ios-app

కొడాలి సవాల్‌ను టీడీపీ స్వీకరిస్తుందా..?

కొడాలి సవాల్‌ను టీడీపీ స్వీకరిస్తుందా..?

టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కొరగాని కొయ్యగా మారిన గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిని దెబ్బకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని కొడాలి నానినే వారికి ఇచ్చారు. గుడివాడలోని తన ఫంక్షన్‌ హాల్లో సంక్రాంతి రోజున తాను క్యాసినో నిర్వహించానని చంద్రబాబు, టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడమే గాక.. బహిరంగంగా పెట్రోల్‌ పోసుకుని ప్రాణాలు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకపోతే.. చంద్రబాబు. ఆ పార్టీ నేతలు ఏం చేస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు. మంత్రివర్గ భేటీ తర్వాత.. సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. తన సవాల్‌ను చంద్రబాబు, టీడీపీ నేతలకు చెప్పాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.

సంక్రాంతి రోజున గుడివాడలోని నాని ఫంక్షన్‌ హాల్లో క్యాసినో, అశ్లీల నృత్యాలు నిర్వహించారంటూ మంత్రిపై టీడీపీ నేతలు రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గోవాగా మార్చేశారంటూ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. కొడాలి నానినే ఇదంతా చేయించారని విమర్శలు చేశారు. ఆ తర్వాత గురువారం ఓ నిజనిర్ధారణ కమిటీని వేశారు. నిజా నిజాలు తేల్చేందుకు టీడీపీ నేతలతో కూడిన నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో ఈ రోజు పర్యటిస్తోంది.

కరోనా సోకడంతో తాను చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లానని, అసలు సంక్రాంతి రోజున తాను గుడివాడలో లేనని నాని చెప్పారు. పండగ రోజున అన్ని ప్రాంతాల్లో జరిగినట్లే.. గుడివాడలోనూ కోడి పందేలు జరిగాయన్నారు. కొంతమంది నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందడంతో.. డీఎస్పీకి ఫోన్‌ చేసి ఆపించానని చెప్పారు. తనపై కావాలనే విమర్శలు చేస్తున్నారంటూ.. చంద్రబాబు. టీడీపీ నేతలపై నాని తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు.

నాని వాదన ఇలా ఉంటే.. టీడీపీ నేతలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటిస్తోంది. మరో వైపు పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ పై టీడీపీ నేతలకు నమ్మకం లేకపోతే.. తమ పరిశీలనలో తేలిన నిజాలను, సాక్ష్యాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చు. నాని కూడా తన సవాల్‌ను చంద్రబాబు, టీడీపీ నేతలకు చెప్పి, వారు ఏం చేస్తారో అడగాలని మీడియా ప్రతినిధులను కోరారు. తాము చేస్తున్న ఆరోపణలు, విమర్శలు నిజమని కనీసం మీడియా ద్వారా నిరూపించడం వల్ల టీడీపీ నేతలు.. కొడాలి నానిని రాజకీయంగా దెబ్బకొట్టవచ్చు. మరి ఈ అవకాశాన్ని టీడీపీ నేతలు సద్వినియోగం చేసుకుంటారా..? కొడాలి నాని సవాల్‌కు స్పందిస్తారా..? చూడాలి.

Also Read : నిర్ణయానికి వచ్చేశాక నిజనిర్ధారణ కమిటీ ఎందుకు అచ్చెన్నా?