Idream media
Idream media
కరోనా వైరస్‌ను కారణంగా చూపుతు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మార్చిలో వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టతతో ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ ఆశిస్తున్నట్లు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. తాజాగా అసెంబ్లీలోనూ తీర్మానం చేసింది. అయితే ఫిబ్రవరిలో కాకుంటే.. స్థానిక పోరు ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న గ్రామ స్థాయి నాయకులు, ప్రజల్లోనూ ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం మంత్రి కొడాలి నాని ఇచ్చారు.
వేసవిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి కొడాలి చెప్పారు. వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా అనువైన పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కారణంగా విద్యా సంవత్సరంలో సగం వృథా అయింది. విద్యార్థులకు పాఠ్యాంశాలు కుదించి బోధన చేస్తున్నారు. ప్రస్తుతం 8, 9 , 10 తరగతుల వారికే తరగతుల నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన 6,7 తరగతుల వారికి, సంక్రాంతి తర్వాత ప్రైమరీ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏప్రిల్ నాటికి విద్యా సంవత్సరం ముగించాల్సి ఉంది. అ లోపు వీలైనంత మేరకు క్లాసులు నిర్వహించి.. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఏప్రిల్‌నాటికి పదో తరగతి పరీక్షలు, ఇతర తరగతుల విద్యార్థులకు క్లాసులు పూర్తవుతాయి. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు వేయి లోపు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నాటికి.. అంటే మారో నాలుగు నెలలకు ఈ సంఖ్య రెండెంకల సంఖ్యకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ప్రభావం తగ్గేందుకు వేసవి కూడా ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులతోపాటు వ్యవసాయ పనులు పూర్తవుతాయి. గ్రామాల్లోని ప్రజలకు తీరక సమయం దొరుకుతుంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా ముప్పు తప్పుడంతోపాటు.. ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని యోచిస్తున్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కొడాలి నాని.. అదే సమయంలో ఎన్నికలకు భయపడి వైసీపీ పారిపోతోందన్న టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వేసవిలో ఎన్నికలు జరుగుతాయన్న మంత్రి, 90 శాతం సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. లేదంటే తాను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు నాయుడు, అచ్చెం నాయుడు రాజీనామా చేస్తారా..? అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కొడాలి ఘాటుగా వ్యాఖ్యానించారు. కొడాలి వ్యాఖ్యలతో.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది అందరికీ స్పష్టత వచ్చింది. అదే సమయంలో టీడీపీ విమర్శలకూ నాని అడ్డుకట్టవేశారని చెప్పవచ్చు.