iDreamPost
iDreamPost
అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో మళ్లీ కాక రేగుతోంది. కోర్ట్ విచారణ నిలిచిపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం వంటి కారణాలతో గత కొంతకాలంగా ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. ఎన్నికలు పూర్తి కావడంతో పాటు గత రెండు మూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుందన్న సంకేతాలు ఇస్తున్నాయి
మే 3 నుంచి రోజువారీ విచారణ
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆశయంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తూ గత ఏడాది జనవరి 20న అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. అయితే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలంతో బిల్లును అడ్డుకుంది. అమరావతి రైతుల పేరుతో హైకోర్టులో కేసులు కూడా వేయించింది. అప్పటి నుంచి రాజధాని అంశంపై విచారణ జరుగుతోంది. కేసును త్వరగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు సూచన మేరకు రోజువారీ విచారణకు హైకోర్టు నిర్ణయించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి బదిలీ కావడంతో దానికి బ్రేక్ పడింది. కాగా కొత్త సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని బెంచ్ ఇటీవల ఈ కేసు పరిస్థితిని సమీక్షించి.. మే మూడో తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో అక్కడికి దాదాపు ఒక నెల రోజుల్లో విచారణ పూర్తి అయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?
త్వరలో విశాఖ నుంచి కార్యకలాపాలు
కేసుల పరిస్థితి పక్కనపెడితే రాష్ట్ర ప్రభుత్వపరంగా తొందరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం ఇవే సంకేతాలనిచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ప్రసంగంలో స్పష్టంచేశారు. అయితే ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కారణంగా రాజధానుల వ్యవహారం అంతగా ప్రస్తావనకు రాలేదు. ఎన్నికలు ముగిసి.. కోడ్ కూడా తొలగిపోవడంతో ప్రభుత్వం మళ్ళీ దీనిపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కోర్ట్ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా తనవంతు ప్రయత్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
మొన్న రాజమహేంద్రవరంలో, తాజాగా అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధానిగా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. కోర్ట్ విచారణ ప్రారంభమయ్యాక.. న్యాయపరమైన సందేహాలన్నింటినీ ప్రభుత్వం తీర్చి కోర్టుకు సహకరిస్తామని, తొందరగా కేసు పరిష్కారమయ్యేలా చూస్తామని కూడా ఆయన చెప్పారు. మరోవైపు కర్నూలును న్యాయ రాజధానిగా రాష్ట్రానికి రాసిన ఓ లేఖలో కేంద్రం పేర్కొనడం తో మూడు రాజధానులకు కేంద్రం సానుకూలమేనని స్పష్టమైంది. కర్నూలు విమానాశ్రయం ప్రారంభించడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర పౌరవిమనయాన మంత్రిత్వశాఖ రాసిన లేఖలో కర్నూలును న్యాయ రాజధానిగా సంబోధించడం రాష్ట్ర ప్రభుత్వంలో జోష్ పెంచింది.
Also Read : చింతా మోహన్ చిలక జోస్యం… చింత చచ్చినా పులుపు చావలేదు