iDreamPost
iDreamPost
ఒకప్పుడు అప్పులిచ్చి పీక్కుతినే వాళ్ళని కాబూలీ వాలాలనేవాళ్ళు. వాళ్ళ వేషం, భాష, వ్యవహారశైలి ఒకరకమైన భీభత్సకరమైన రీతిలోనే ఉండేవని అంటుంటారు అప్పటి వాళ్ళెవర్ని కదిలించినా. కాలం మారింది ఆ తరహా వేషభాషలతో హంగామా చేసేవాళ్ళు ఇప్పుడు కన్పించడం లేదు. నయా ఫైనాన్సియర్‌ల వంతు వచ్చింది. ఇటువంటి వాళ్ళ నుంచి అమాయకులను రక్షించేందుకు చట్టం తన వంతు ప్రయత్నం చేస్తోంది.
కానీ ఆన్‌లైన్ కాలంలో ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకు ఎరవేస్తూ, ఆ తరువాత వాళ్ళతో ఓ ఆటాడుకుంటున్న ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్‌లు సిద్ధమయ్యాయి. ఏదో ఒక ఆట పేరుజెప్పి ఈ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఆ తరువాత మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత మొత్తం క్షణాల్లో అక్కౌంట్‌కు వేస్తున్నారు. దీన్ని వడ్డీతో వాయిదాల పద్దతిలో చెల్లించాల్సి ఉంటుందన్న మాట. అంటే ఏదో రూపాయో, రూపాయన్నరో, రెండు రూపాయలో వడ్డీ కాదండోయ్.. ఈ యాప్‌ద్వారా ఇచ్చిన మొత్తానికి సదరు అమాయకుడు కట్టే వడ్డీ లెక్కేస్తే దాదాపు 30శాతం నుంచి 48శాతం వరకు ఉంటుందని ఒక అంచనా. తీసుకున్న అప్పుకు నాలుగైదు వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే మళ్ళీ అప్పు మొత్తాన్ని పెంచి రెన్యువల్ చేసేసి, ఆ అప్పుల ఊబి నుంచి బైటపడకుండా ముందరికాళ్ళకు బంధం వేసేస్తున్నారు. తీసుకునే వాడికి అప్పును అలవాటు చేయడంతో పాటు, ఆ అప్పు తీర్చేయకుండా చూడడం, ఈ రూపేణ భారీగా లబ్దిపొందడం సదరు మనీలెండింగ్ యాప్‌ల ప్రధాన లక్ష్యం.
ఇక వీటి భారిన పడేది ఎవరంటే.. విచ్చలవిడిగా షాపింగ్‌లు చేసేవాళ్ళు, ఆన్‌లైన్ రమ్మీలు, బెట్టింగ్‌లు ఆడేవాళ్ళు, ఉన్న పళంగా ఆదాయం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నవారు, ముఖ్యంగా చిరుద్యోగులు ఈ యాప్‌లను ఎక్కువగా వినియోగించుకుంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పై జాబితాలో ఉన్నవాళ్ళంతా గ్యారెంటీ ఆదాయం లేని వాళ్ళుగానే గుర్తించొచ్చు. అందుకే వడ్డీ గురించి ఆలోచించకుండా అప్పులు తీసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. తగిన ఆదాయం లేకపోవడంతో ఆ అప్పును తీర్చడం వీళ్ళవల్ల కావడం లేదు. దీంతో సదరు యాప్ ఎగ్జిక్యూటివ్‌లనుంచి బెదిరింపులు ప్రారంభమవుతుంటాయి. అంటే గతంలో కాబూలీ వాలాల ముత్తాతల కంటే ఎక్కువగానే ఈ బెదిరింపులు ఉంటున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. దీంతో మానసికంగా వ్యక్తిని కృంగదీస్తున్నారంటున్నారు.
యాప్ డౌన్‌లో చేసుకునే క్రమంలోనే సదరు వ్యక్తి పర్సనల్‌డాటాను కూడా తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు డాటాను ఉపయోగించి మరీ బెదిరింపులకు దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ మనీలెండింగ్ యాప్‌ల ద్వారా అప్పులు పొంది, తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు కూడా సిద్దపడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లుగా సంబంధిత నిఘావర్గాలు గుర్తించాయంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది.
ఆన్‌లైన్ రమ్మీ, బెట్టింగ్ తదితర వ్యసనాలను ప్రోత్సహిస్తూనే, అందుకు కావాల్సిన అప్పులను కూడా యాప్‌ల ద్వారా వ్యవసనపరులకు అందుబాటులో ఉంచుతున్నారు. తెలియక ఈ ఊబిలో ఒక్క సారి చిక్కుకుంటే బైటపడడం దాదాపు అసాధ్యం అనుకునేంత రీతిలో అమాయకులను కార్నర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారాలను నియంత్రించాలని, ముఖ్యంగా రమ్మీ, పేకాట వంటివాటిని కట్టడి చేయాలని ఏపీ సీయం జగన్ కేంద్ర హోందశాఖకు లేఖ కూడా రాసారు. అందుకు అనుగుణంగానే గూగుల్ యాప్‌లు ఇటువంటి మనీ లెండింగ్ యాప్‌లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇటీవలే ప్రకటించింది. ఇవే కాకుండా ఎవరికివారు ఈ ఊబిలోకి చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.