iDreamPost
android-app
ios-app

అన్నీ అమర్చి పెడుతున్నాడు కాబట్టి పురుషుడు స్త్రీని కంట్రోల్ చేయవచ్చు: ఇది ఎంతవరకు సమంజసం?

అన్నీ అమర్చి పెడుతున్నాడు కాబట్టి పురుషుడు స్త్రీని కంట్రోల్ చేయవచ్చు: ఇది ఎంతవరకు సమంజసం?

“నీ మొగుడు సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు తన మాట వినాలి”, “నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నీ పెళ్ళాన్ని చెప్పుచేతల్లో పెట్టుకో” – ఇలాంటి మాటలు మన ఇళ్ళల్లో ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. అంటే మగవాళ్ళు ఆడదానికి కావల్సినవన్నీ సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినాలి, వాళ్ళకు ఎదురు తిరగకూడదు. కొన్ని శతాబ్దాలుగా ఇదే మాట ఆడవాళ్ళకు నూరి పోస్తూ వస్తున్నారు. ఇటు మగాళ్ళకూ మీరే ఆడదాని రక్షకులు అని చిన్నప్పటి నుంచే చెబుతూ పెంచుతున్నారు. స్త్రీలకు పరిణతి ఉండదు, డబ్బు వ్యవహారాలు చక్కబెట్టడం తెలీదు, వాళ్ళను వాళ్ళు చూసుకోలేరు కాబట్టి మగాళ్ళే వాళ్ళకి కావల్సినవన్నీ అమర్చాలి అని నేర్పుతున్నారు. ఆడదానికి అన్నీ సమకూర్చడమనేది ముందు తండ్రి నుంచి మొదలవుతుంది. తర్వాత ఆ బాధ్యత భర్త అందుకుంటాడు. ఆ తర్వాత కొడుకు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. పితృస్వామ్య వ్యవస్థలో ఇలా ఆడదాన్ని కంట్రోల్ చేయడానికే మగాడి సగ జీవితం అంకితమైపోతోంది.

ఎవరు చెబుతున్నారు ఇదంతా?

ఒక్కరని కాదు అమ్మా నాన్న, అమ్మమ్మ, తాతయ్య, బంధువులు, పక్కింటివాళ్ళు, వెనకింటి వాళ్ళు, సినిమాలు, సీరియళ్ళు- ఇలా చాలా మందే ఆడవాళ్ళని కంట్రోల్ చేసుకోవడమెలా అనే విషయంలో మగాడికి ఉచిత సలహాలు పారేస్తుంటారు, మగాడు చెప్పింది వినాలి అని ఆడవాళ్ళకి మోరల్ క్లాసులు పీకుతుంటారు. మరి వీళ్ళందరికి ఎవరు చెప్పారంటే అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎట్సెట్రా!

మనందరి ఇళ్ళల్లో మూమూలుగా జరిగేదే!    

ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. అమ్మ కిచెన్ లో వంట చేస్తుంటుంది. నాన్న ఆ అమ్మాయిని మళ్ళీ చదువుకుందువులే గానీ వెళ్ళి అమ్మకి సాయం చెయ్యి అంటాడు. ఈ మాట చెప్పే నాన్న తీరిగ్గా పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ పక్కనే ఆ పాప తమ్ముడో, అన్నో టీవీ చూస్తూ ఉంటాడు. కానీ చదువుకునే అమ్మాయినే మధ్యలో లేపుతున్నాడంటే వంట పని, ఇంటి పని చేయడం ఆడవాళ్ళ డ్యూటీ అని ఆ నాన్న చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అంతా చూస్తున్న కొడుకు తను కూడా ఇలాగే చేయాలేమో అనుకుంటాడు.

ఏమి వేసుకోవాలో కూడా వాళ్ళే చెబుతారు!

ఒక అబ్బాయి చెల్లి లేదా అక్క, ఆఖరికి అమ్మకైనా ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పడం చాలా ఇళ్ళల్లో కనిపిస్తుంటుంది. నాన్నలు, అన్నయ్యలు, భర్తలు ఇంట్లో ఆడవాళ్ళు డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారా ఇక అంతే సంగతులు! “సంపాదిస్తే తెలుస్తుంది” అని విసుర్లు. ఆడవాళ్ళు స్మార్ట్ ఫోన్ కొనాలా లేదా ఇంట్లోని మగాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో అంతా వాళ్ళ కంట్రోల్ లోనే ఉంటుంది.

ఒకప్పుడు మరీ దారుణం!

ఇప్పుడంటే నయం కానీ ఒకప్పుడు ఆడవాళ్ళను ఒంటరిగా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. మగాడి నీడలోనే ఆడది బతకాలని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేవాళ్ళు. సరైన చదువు లేక, కెరీర్ అనేది అసలే లేక ఆడవాళ్ళు మగాళ్ళపై పూర్తిగా ఆధారపడిపోయేవాళ్ళు. సంపాదించే వాడికున్న గౌరవం వాళ్ళపై ఆధారపడేవాళ్ళకి ఎందుకుంటుంది చెప్పండి.

మగాళ్ళు ఆడవాళ్ళను ఎందుకు కంట్రోల్ చేయాలి?

ఎవరైనా పని గట్టుకుని మగాళ్ళకు ఆడదాన్ని కంట్రోల్ చేసే హక్కు ఇచ్చారా లేక తెలియకుండానే ఇద్దరి మనసుల్లోనూ ఈ భావజాలం పాతుకుపోయిందా అంటే రెండూ నిజమే అని చెప్పాలి. ఆడదానికి ఎలా డ్రెస్ చేసుకోవాలో, ఎలా నడవాలో, ఎలా నవ్వాలో, ఎలా ఏడ్వాలో, ఎవరిని కలవాలో చెప్పడంలో తప్పు లేదని ప్రతి మగాడు అనుకుంటాడు. కానీ విషాదమేంటంటే సలహాగా మొదలైన ఈ తతంగం తర్వాత తర్వాత ఆర్డర్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఆడది మాట విన్నదా సరే లేదంటే తెగించింది అని ముద్ర వేస్తారు. ఎప్పుడెప్పుడు హర్ట్ అవుదామా అని కాచుక్కూచునే మగాడి ఇగో ఇట్టే దెబ్బతిని పోతుంది. అప్పుడు తన మాట నెగ్గించుకోవడానికి మగాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం హింస ! అది శారీరక హింస కావచ్చు, మానసిక హింస కావచ్చు. దెబ్బకి ఆ ఆడపిల్ల మానసిక స్థైర్యం పాతాళానికి పడిపోతుంది. మళ్ళీ కాళ్ళ బేరానికొస్తుంది. అదీ మనోడి స్ట్రాటజీ. అప్పటికీ మాట వినలేదా చంపడానికైనా వెనకాడరు కొందరు. మనవరాలు జీన్స్ వేసుకోవద్దంటే వినిపించుకోలేదని ఓ తాత చావబాదాడు. పాపం ఆ పిల్ల దెబ్బలకి తాళలేక ప్రాణాలు విడిచింది. మగాడి ఇగో మరీ ఎక్కువగా హర్ట్ అయితే ఇదే జరుగుతుంది మరి!

నిజంగానే మగాడు సంపాదిస్తే ఆడది తిని కూర్చుంటుందా?  

ఆశ్రయం ఇచ్చి, తిండి పెట్టినంత మాత్రాన ఎవరికీ అవతలి వాడి జీవితాన్ని కంట్రోల్ చేసే హక్కు వచ్చేయదు. ఆడది మగాడి మీద ఎంత ఆధారపడుతుందో మగాడు కూడా ఆడదానిపై అంతే ఆధారపడుతున్నాడు. మగాడు బయటికెళ్ళి డబ్బు సంపాదిస్తే ఆడది ఇంట్లో అన్ని పనులూ చూసుకుంటుంది. జీతం లేని పనిమనిషిలా వంట చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటుంది, తన ప్రాణాలు పణంగా పెట్టి వారసుల్ని కంటుంది. ఇంతేనా? ఇంట్లో అన్ని పనులూ చక్కబెట్టుకుంటూనే బయటికెళ్ళి జాబులు చేసేవాళ్ళున్నారు, బిజినెస్ చేసే ఆడవాళ్ళూ ఉన్నారు. కానీ ఇవన్నీ అసలు లెక్కలోకే రావు. ప్రతి ఇంట్లో నిర్ణయాధికారం మగాళ్ళ చేతుల్లోనే! ఎందుకు? మగాడు కాబట్టే కదా!