iDreamPost
iDreamPost
దీపావళి పండగ సందర్భంగా విడుదలైన విజయ్ మాస్టర్ టీజర్ ఆన్లైన్ లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ ఇంకా రానప్పటికీ సబ్ టైటిల్స్ సహాయంతో మనవాళ్ళు కూడా చూసేశారు. వ్యూస్ లో కొత్త రికార్డులు సృష్టించేందుకు మాస్టర్ పరుగులు పెడుతున్నాడు. ముందు నుంచి స్కై లెవెల్ అంచనాలు ఉన్న ఈ సినిమా హైప్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాక హౌస్ ఫుల్ బోర్డుతో హోరెత్తిపోయే మొదటి చిత్రంగా దీని మీద ట్రేడ్ కోటి ఆశలు పెట్టుకుంది. తుపాకీ, అదిరింది, విజిల్ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత విజయ్ కు ఇక్కడా మంచి మార్కెట్ ఏర్పడింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో మాస్టర్ కు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో 1997లో వచ్చిన చిరంజీవి మాస్టర్ కథకు దీనికి పోలికలు ఉన్నాయనేదే దాని సారాంశం. టీజర్ ని నిశితంగా గమనిస్తే అందులో వాస్తవం ఉందనిపిస్తుంది. రెండు సినిమాల్లోనూ హీరో లెక్చరర్. చిరంజీవి మాస్టర్ లో గాడి తప్పిన కాలేజీని అందులో మితిమీరి ప్రవర్తిస్తున్న రౌడీ స్టూడెంట్స్ కంట్రోల్ చేసి ఓ ప్రేమ జంట కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధపడతాడు హీరో. విజయ్ మాస్టర్ లోనూ అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఇతను డ్యూయల్ రోల్ చేసినట్టు చెన్నై టాక్. రెండో వాడు ఏం చేస్తాడు అనేది మాత్రం సస్పెన్స్.
ఒకవేళ ఇది నిజమైనా కాకపోయినా మాస్టర్ మీద సాధారణ ప్రేక్షకులకూ ఆసక్తి మొదలయ్యింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలు రాలేదు. అందులోనూ ఖైదీ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీద అందరికీ మంచి గురి ఉంది. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో థ్రిల్ చేస్తాడనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే కమల్ హాసన్ పిలిచి మరీ విక్రమ్ బాధ్యతలు ఇచ్చారు. మాస్టర్ ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా లేక సంక్రాంతి బరికి దింపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. తమిళులకు పొంగల్ సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి అప్పుడు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.