iDreamPost
android-app
ios-app

మేయర్, చైర్మన్‌ ఎన్నికలు నేడు

మేయర్, చైర్మన్‌ ఎన్నికలు నేడు

ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ రోజు జరగబోతోంది. ఆయా పట్టణ పాలక సంస్థలకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన వెల్లడైన 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయదుందుబి మోగించింది.

12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. కోర్టు ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ ఫలితాలు వెల్లడించలేదు. ఫలితాలు వెల్లడైన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం కార్పొరేషన్లను వైసీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. 75 పుర, నగర పంచాయతీల్లో 73 చోట్ల అఖండ విజయం సాధించింది. మైదుకూరులో 24 వార్డులకు గాను టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 వార్డు గెలుచుకున్నాయి. ఇక్కడ ఎక్స్‌ అఫిషియో ఓటుతో చైర్మన్‌ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకోవడం లాంఛనమే. తాడిపత్రిలో ఎన్నిక ఆసక్తి కరంగా మారింది. ఇక్కడ 36 వార్డులు ఉండగా.. టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క వార్డు చొప్పున గెలిచారు. ఈ ఇద్దరూ టీడీపీకి మద్ధతు ఇస్తున్నట్లు చెబుతుండడంతో.. చైర్మన్‌ పీఠం టీడీపీకి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. తాడిపత్రి మినహా మిగతా 74 పుర, నగర పంచాయతీల్లో వైసీపీ చైర్మన్ల ఎన్నికవడం నల్లేరు మీద నడకే.

పాలనలో మరింత మందికి బాధ్యతలు కల్పించేలా వైసీపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. నగరపాలక సంస్థలు, పుర, నగర పంచాయతీలలో ఇకపై ఇద్దరుచొప్పన డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్లను ఎంపిక చేయబోతున్నారు. ఈ మేరకు జగన్‌ సర్కార్‌ ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చింది.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఎంపికపై వైసీపీ అధిష్టానం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. బుధవారం సాయంత్రమే ఈ జాబితాను ప్రకటించాలని వైసీపీ అనుకున్నా.. జాబితా తుది దశలో ఉండడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు ఉదయం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఎవరనేది వైసీపీ వెల్లడించబోతోంది. పలు చోట్ల ఎన్నికలకు ముందే మేయర్లు, చైర్మన్లు ఎవరనేది వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎంపిక చేయాల్సి రావడంతోనే ఎక్కువ సమయం పడుతోంది.

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు.. నాడు– నేడు.. ఎంత వ్యత్యాసం..?