Idream media
Idream media
ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలంటారు. లేదంటే ఫలితం ఉండదని చెబుతుంటారు. అది అక్షర సత్యమని బీఎస్పీ అధినేత మాయావతి రాజకీయంగా వ్యవహరిస్తున్న తీరుతో నిరూపితమవుతోంది. రాజకీయ పార్టీ ఏదైనా దాని అంతిమలక్ష్యం అధికారమే. ఎన్నికలు, ఓట్లు చుట్టూనే రాజకీయాలు సాగుతుంటాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజల మన్ననలు పొందుతాయి. అంతిమంగా ఆయా పార్టీలకు ప్రజలు ఓట్ల రూపంలో మార్కులు వేస్తారు. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ.. ప్రజా సమస్యలు, ప్రజల ఇబ్బందులపై పల్లెత్తు మాట కూడా మాట్లాడని మాయావతి.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై గొంతు సవరించుకుంటుండడం గమనార్హం.
ధరలు కట్టడి చేయాలని డిమాండ్..
దేశంలో రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితిపై తాజాగా మాయావతి స్పందించారు. ధరలను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా దేశంలోని పేద ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక వైపు పెరుగుతున్న నిరుద్యోగం, దానికి తోడు ద్రవ్యోల్బణం.. దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి..’’ అంటూ మాయావతి ట్విట్టర్‌లో పోస్టు పెట్టి డిమాండ్ చేశారు.
చాలాకాలం తర్వాత..
చాలాకాలం తర్వాత మాయావతి ప్రజా సమస్యలు, ఇబ్బందులపై స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో 2007–12 మధ్య చివరగా మాయావతి అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 2012, 2017, 2022 ఎన్నికల్లో మాయావతి పార్టీ పుంజుకోకపోగా.. ఆ పార్టీ పరిస్థితి దిగజారింది. గడిచిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఇంతటి పేలవమైన ఫలితాలు రావడానికి కారణం మాయావతినే. పార్టీ పటిష్టతకు ఆమె చేసింది శూన్యం. ప్రజా సమస్యలు, ఇబ్బందులపై ప్రశ్నించిన దాఖలాలు లేవు.
ఎన్నికల సమయంలో మౌనం..
సాధారణ రోజుల్లోనే కాదు.. ఎన్నికల సమయంలోనూ మాయావతి ప్రజా సమస్యలు, ఇబ్బందులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడలేదు. తాజాగా మాయావతి ఆందోళన వ్యక్తం చేసిన ధరల సమస్య ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ ఉంది. అయినా ఆమె వాటిపై ప్రశ్నించలేదు. ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ధరలను కట్టడి చేయాలంటూ ఇప్పుడు చేసిన మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు మాదిరిగానే.. మొన్న జరిగిన ఎన్నికల్లో పనిచేసి ఉంటే.. బీఎస్పీ పరిస్థితి మరోలా ఉండేది. కనీసం చెప్పుకోదగ్గ సీట్లు అయినా ఆ పార్టీ గెలుచుకునేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న మాయావతి.. మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో నిలదొక్కుకుంటారా..? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న.