గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ రేటింగ్ భారీగా పడిపోయింది. 4.6 ఉన్న రేటింగ్ కాస్త 1.2 స్టార్ రేటింగ్ కి దిగజారింది. టిక్ టాక్ లైట్ వెర్షన్ రేటింగ్ 1.1 కి పడిపోయింది. ఇండియాలో టిక్ టాక్ ని నిషేధించాలని సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.
టిక్ టాక్ రేటింగ్ దిగజారడానికి కారణాలు ఏంటి?
టిక్ టాక్ లో అర్ధ నగ్న ప్రదర్శనలతో పాటుగా, ఇతరులను కించపరిచేలా వీడియోలు చేస్తున్నారని మొదటినుండి ఉన్న ఆరోపణ. టిక్ టాక్ వీడియోలను రూపొందించే క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా తెలిసిన విషయమే.. కాగా గత వారం నుండి యుట్యూబ్ క్రియేటర్స్ కి టిక్ టాక్ క్రియేటర్స్ కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. యుట్యూబ్ క్రియేటర్స్ ని దూషిస్తూ టిక్ టాక్ లో వీడియోలు రావడంతో యుట్యూబ్ క్రియేటర్స్ టిక్ టాక్ ని నిషేధించాలని పిలుపునిస్తూ వీడియోలు రూపొందించారు. ముఖ్యంగా ఇండియాలో టాప్ యుట్యూబ్ క్రియేటర్ అయిన “క్యారీ మినాటి” టిక్ టాక్ ని నిషేధించాలని చేసిన వీడియో అనూహ్య స్పందనను దక్కించుకుంది. దీంతో టిక్ టాక్ ని ఇండియాలో నిషేధించాలన్న వాదన మరోసారి ఊపందుకుంది.
ట్విట్టర్ లో కూడా #BanTikTokInIndia ట్రెండ్ అయింది. దాని ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్ లో అనూహ్యంగా టిక్ టాక్ రేటింగ్ పడిపోయింది. తాజాగా ఫైజల్ సిద్ధిఖి అనే టిక్ టాకర్ మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను టిక్ టాక్ నుండి తొలగించి వీడియో రూపొందించిన ఫైజల్ సిద్దిఖీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని జాతీయ మహిళా కమీషన్ ప్రకటించడంతో పాటు టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయాలని నరేంద్ర మోడీని కోరనున్నట్లు జాతీయ మహిళా కమీషన్ ప్రకటించడంతో టిక్ టాక్ స్టార్ రేటింగ్ దారుణంగా దిగజారింది.
ఏది ఏమైనా టిక్ టాక్ లో వీడియోలు రూపొందిస్తున్న కొందరు శృతి మించుతున్న విషయం తెలిసిందే. అలాంటి వీడియోలు రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టిక్ టాక్ పై ఉంది. ఇకనైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కఠినతరం చేసి అందుకు అనుగుణంగా వీడియోలు రూపొందించే వారిని మాత్రమే అప్రూవ్ చేసేల చర్యలు తీసుకుంటే టిక్ టాక్ కి మంచిది.