iDreamPost
iDreamPost
మూవీ లవర్స్ కి మార్చ్ నెల కొంత నిరాశ మిగిల్చేలా ఉంది. చెప్పుకోదగ్గ హైప్ ఉన్న సినిమాలేవీ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సంక్రాంతికి రెండు భారీ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాక బాక్స్ ఆఫీస్ కొంత డల్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఐదారు సినిమాలు డిజాస్టర్ కావడంతో ట్రేడ్ సైతం నిరాశలో కూరుకుపోయింది. అయితే నితిన్ భీష్మ అనూహ్యంగా ఊహించిన దాని కన్నా పాజిటివ్ రెస్పాన్స్ తో హిట్ టాక్ తెచ్చుకోవడంతో జోష్ వచ్చింది. ఇది మహా అయితే ఇంకో వారం లేదా పది రోజులు కొనసాగుతుంది.
ఫిబ్రవరి సాధారణంగా డ్రై మంత్ కాబట్టి మరీ ఎక్కువ లాంగ్ రన్ ఆశించలేం. అయితే భీష్మకు అసలే పోటీ లేకపోవడం చాలా పెద్ద ప్లస్ కానుంది. నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు జరగలేదు. ఆ కోణంలో భీష్మ మరో ఘనత సాధించినట్టే. ఈ నెలాఖరుకు వస్తున్న విశ్వక్ సేన్ హిట్ మీద చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నాయి కానీ అది మాస్ జానర్ మూవీ కాదు కాబట్టి మరీ అద్భుతాలు చేయకపోవచ్చు. ఇక మార్చ్ లో చూసుకుంటే ఉగాది పండక్కు 25న వచ్చే నాని వి వరకు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే ఏ సినిమాలు లేకపోవడం షాక్ కలిగించే విషయమే.
మొదటివారంలో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, అర్జున, ఓ పిట్ట కథ లాంటివి షెడ్యూల్ చేశారు కానీ వీటిలో దేనికీ మినిమమ్ బజ్ కూడా లేదు. విడుదల తేదీలు కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండో వారం ఖాళీగా వదిలేశారు. మూడో వారంలో ఒకేసారి నాని వి, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా రాబోతున్నాయి. వి సినిమా మీద క్రేజ్ ఉంది కానీ మార్కెట్ వీక్ గా ఉన్న రాజ్ తరుణ్ నానితో క్లాష్ కు సిద్ధపడి అనవసర రిస్క్ తీసుకుంటున్నాడన్న కామెంట్స్ ట్రేడ్ లో ఉన్నాయి. సో మార్చ్ అంటే పరీక్షల సీజన్ కాబట్టి నిర్మాతలు భయపడతారు కానీ నిజంగా సత్తా ఉంటె ఇదేమి పెద్ద విషయం కాదని రెండేళ్ల క్రితం మార్చ్ లోనే వచ్చిన రంగస్థలం ప్రూవ్ చేసిన విషయం మర్చిపోకూడదు.