iDreamPost
android-app
ios-app

Manoharam : ఊహించని భావోద్వేగాల మనోహరం – Nostalgia

  • Published Nov 10, 2021 | 12:06 PM Updated Updated Nov 10, 2021 | 12:06 PM
Manoharam : ఊహించని భావోద్వేగాల మనోహరం – Nostalgia

1998లో చిరంజీవికి చూడాలని ఉంది రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చాక దర్శకుడు గుణశేఖర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ,మంచి సెంటిమెంట్ పాయింట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అగ్ర హీరోల నుంచి పిలుపు వచ్చినా గుణశేఖర్ మనసులో మాత్రం ఎప్పటి నుంచో చేయాలని ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఒకటి తెరకెక్కించాలన్న సంకల్పం పెరిగింది. అప్పటికే ఎంఆర్సి మెలోడీ కంబైన్స్ కు కమిట్మెంట్ ఒకటి బాకీ ఉండటంతో మనోహరం కథ రూపంలో దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి రచయిత పోసాని కృష్ణమురళి తోడవ్వడంతో అడుగులు వేగంగా పడ్డాయి.

ఫ్యామిలీ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబుని గాయం తరహాలో మరోసారి సీరియస్ డ్రామాలో ప్రెజెంట్ చేయాలన్న ఆలోచనే మనోహరంకు అతనే మంచి ఛాయస్ అనిపించేలా చేసింది. స్వయంవరంతో పరిచయమై పేరుతో పాటు అవార్డులూ తెచ్చుకున్న లయకు అప్పటికి రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ బరువైన ఉషా పాత్రకు ఎంపిక చేసుకున్నారు. మరో ఆలోచన లేకుండా తననే మళ్ళీ తీసుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మణిశర్మ చక్కని స్వరాలు సిద్ధం చేశారు. శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తదితర విభాగాలతో టీమ్ ని పర్ఫెక్ట్ గా రంగరించి సినిమాను పూర్తి చేశారు.

కొత్తగా పెళ్ళై అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న ఓ జంట జీవితంలో పోలీసులు ప్రవేశిస్తారు. చిన్న పొరపాటు వల్ల బ్యాంకు ఉద్యోగి అయిన భర్తను తీవ్రవాదిగా ముద్రవేసి జైలుకు పంపిస్తారు. అతన్ని నిర్దోషి అని ఋజువు చేసి బయటికి తీసుకొచ్చే బాధ్యతను భార్య తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ దంపతులు ఉగ్రవాదుల ఉనికిని తవ్వుతారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే మణిరత్నం రోజా స్ఫూర్తితో రాసుకున్న కథే. కాకపోతే మెయిన్ ట్విస్ట్ ని ఇందులో మార్చారు అంతే. టేకింగ్, మ్యూజిక్, ఆర్టిస్టులు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరినప్పటికీ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడంలో జరిగిన తడబాటు, కాంబో మీద అంచనాలు వెరసి మనోహరం ఆశించిన స్థాయిలో కమర్షియల్ అద్భుతాలు చేయలేకపోయింది. 2000 మే 13న రిలీజైన మనోహరం ఇప్పటి సినిమాలతో పోలిస్తే మంచి చిత్రం అనిపించుకుంటుంది

Also Read : Aithe : నలుగురు కుర్రాళ్లతో థ్రిల్లింగ్ డ్రామా – Nostalgia