iDreamPost
iDreamPost
నిన్న సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్నతో పాటు విడుదలైన సినిమా మంచి రోజులు వచ్చాయి. ప్రతి రోజు పండగే లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు మారుతీ తీసిన చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ మూవీకి మొన్న రాత్రి నుంచే ప్రీమియర్లంటూ హడావిడి చేసి యూనిట్ గట్టిగానే ప్రమోషన్ చేసింది. సంతోష్ శోభన్ లాంటి అప్ కమింగ్ హీరోకి ఈ మాత్రం హైప్ తీసుకురావడం విశేషమే. యువి సంస్థ ఇందులో నిర్మాణ భాగస్వామి కావడంతో కంటెంట్ ఉంటుందనే నమ్మకం కలిగింది. మరి మంచి రోజులు వచ్చాయి టైటిల్ కు తగ్గట్టు ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం
ఇది అతి భయంతో జీవితాన్ని గడిపే గోపాలం తిరుమల శెట్టి(అజయ్ ఘోష్)కథ. కూతురు పద్మ(మెహ్రీన్)ప్రేమలో పడిందని తెలుసుకున్న గోపాలంలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. ఎవరు అల్లుడైతే జీవితం గందరగోళం అవుతుందని భయపడతాడో ఆ సంతోష్(సంతోష్ శోభన్) మామగారిలో మార్పు తెచ్చేందుకు కంకణం కట్టుకుంటాడు. చివరికి ఆ రుగ్మతను పోగొట్టి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది సినిమాలో చూడాలి. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో అచ్చంగా అసలు పాయింట్ ఇదే. దర్శకుడు మారుతీ హీరో లేదా ఏదైనా లీడ్ క్యారెక్టర్ కి ఓ వీక్నెస్ పెట్టి దాని చుట్టే కథను అల్లుకునే బలహీనతను ఇందులో కూడా కొనసాగించాడు.
టైటిల్ ని చూసి దీన్నో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు తక్కువ టైంలో తీయాలని హడావిడిగా స్క్రిప్ట్ రాసుకుని ఓ మోస్తరు సన్నివేశాలకు కూడా జనం విరగబడి నవ్వుతారని భ్రమించి జొప్పించిన హాస్యం అంతగా పండలేదు. పైగా కరోనా లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని ఓవర్ కామెడీతో ఖంగాళీ చేయడం బాలేదు. ఓ రెండు ఎపిసోడ్లు తప్ప అధిక శాతం చికాకు వచ్చేలానే సాగింది మంచి రోజులు వచ్చాయి. ఎమోషన్లను సైతం సరిగా రిజిస్టర్ చేయలేకపోయారు. మారుతీ స్థాయి కథా కథనాలు మాత్రం ఇందులో కనిపించవు. అనూప్ సంగీతం వరకు పర్వాలేదు. లెన్త్ కూడా ఎక్కువయ్యింది
సంతోష్ శోభన్ నటన పరంగా గొప్పగా చెప్పుకునే పాత్ర కాదు కానీ బడ్జెట్ సినిమాలకు తాను ఎందుకు మంచి ఛాయసో మరోసారి చూపించాడు. మెహ్రీన్ సన్నబడటం తప్ప నటనకు పెద్దగా స్కోప్ లేదు. అజయ్ ఘోష్ కు ఎక్కువ స్పేస్ దక్కింది. దర్శకుడు చెప్పినట్టు చెలరేగిపోయాడు. మారుతీ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే క్యాస్టింగ్ ఇందులోనూ ఉంది. కాకపోతే ఎవరికీ సరైన క్యారెక్టరైజేషన్ కుదరలేదు. గతంలో తండ్రి చావు మీద కామెడీని జనం ఆదరించారు కదానే లెక్కలో ఏదో దీన్ని తీశారు కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో లాభాలు రావడం వల్ల నిర్మాతలకు మంచి రోజులు అనిపించవచ్చు కానీ చూసిన ప్రేక్షకులకు మాత్రం కాదు.
Also Read : Peddhanna : పెద్దన్న సుత్తన్న