అసలే కోతి పైగా కల్లు తాగి ఉంది అని ఒక సామెత ఉంది, అంటే మామూలుగానే కోతి అనేక తుంటరి పనులు చేస్తూ ఉంటుంది. పైగా అది గనుక మత్తులో ఉంటే ఇంకా ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో ఈ సామెతను వాడుతారు. అయితే మనిషి కూడా అందుకు ఏ మాత్రం తక్కువ కాదు. తాజాగా మద్యం మత్తు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పొట్టేలు తల అనుకుని మనిషి తల నరికిన సంఘటన మదనపల్లె రూరల్లో ఆదివారం రాత్రి జరిగింది. వలసపల్లెలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి గ్రామస్థులంతా రాత్రి దీలుబోణాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు వదిలిన పొట్టేలును ఇదే గ్రామానికి చెందిన చలపతి నరికేందుకు ముందుకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న చలపతి, అంతా సిద్దం అనుకుని వేటు వేశాడు, కానీ అది పొట్టేలు మీద కాదు.
దానిని కదల కుండా పట్టుకున్న ఇదే గ్రామానికి చెందిన టి.సురేష్(35) అనే వ్యక్తి మీద వేశాడు. దీంతో అతని మెడ భగాం మీద తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన సురేష్ ను స్థానికులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా పండుగ వాతావరణం అంతా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా చాలా మంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరిచి ఆనందం కలిగేలా చేస్తాయి.
అయితే ఎప్పుడైనా సరదాకి తీసుకుంటే సరే కానీ రోజు అదే పనిగా మద్యం సేవిస్తూ ఉంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. అందుకే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే దానిని రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మద్యపాన నిషేధాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారు. అందులో భాగంగానే ప్రధాన బ్రాండ్లకు చెందిన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నిషేధించారు. మద్యం ధరలను కూడా పెంచారు.
Also Read : యూపీ ఎన్నికల్లో పరశురాముడు!