iDreamPost
android-app
ios-app

ప్రాణం తీసిన వెయ్యిరూపాయిల వివాదం

  • Published Jun 20, 2022 | 6:22 PM Updated Updated Jun 20, 2022 | 6:22 PM
ప్రాణం తీసిన వెయ్యిరూపాయిల వివాదం

వెయ్యి రూపాయలు అప్పిచ్చిన పాపానికి.. అతని ప్రాణాలనే బలితీసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో జరిగిందది. వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు(45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్ ఇటుకరాళ్ల కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇంటి పనినిమిత్తం 200 సిమెంటు రాళ్లను తెచ్చుకుని ఇంటివద్ద ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకున్నాడు. వాటికి సంబంధించి రూ.1000 ఇవ్వాలని లేదా తీసుకున్న సిమెంటు రాళ్లైనా తిరిగి ఇవ్వాలని శ్రీనివాసరావు ఒత్తిడి చేశాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్యన పలుమార్లు గొడవ కూడా జరిగింది. ఆదివారం సాయంత్రం కూడా ఈ విషయంపైనే ఇద్దరూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో రంగా తనకు సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. ఊహించని పరిణామంతో జరిగిన ఈ హత్య గ్రామంలో సంచలనం రేపింది. శ్రీనివాసరావుకు భార్య, నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.