iDreamPost
android-app
ios-app

Kcr mamata – కేసీఆర్ కు దక్కనిది.. మమతకు దక్కింది -ఇద్దరు సీఎంల విషయంలో మోదీ భిన్నవైఖరి ఎందుకో?

  • Published Nov 26, 2021 | 11:34 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Kcr mamata – కేసీఆర్ కు దక్కనిది.. మమతకు దక్కింది  -ఇద్దరు సీఎంల విషయంలో మోదీ భిన్నవైఖరి ఎందుకో?

ఇద్దరూ ముఖ్యమంత్రులే. తమ తమ రాష్ట్రాల సమస్యల గురించి ప్రధానమంత్రిని కలిసి చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు. కానీ ఒక్కరికే ఆ అవకాశం దక్కింది.. ఇంకొకరు మూడు రోజులు వేచి చూసినా ఫలితం లేక వెనుదిరిగాల్సి వచ్చింది. మూడు రోజులు ఎదురుచూసినా మోదీ అపాయింట్మెంట్ దొరకని సీఎం కేసీఆర్ ఒక రకంగా అవమానానికి గురైనట్లే. ఆయన తర్వాత ఢిల్లీ వెళ్లిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాత్రం వెళ్లిన రెండో రోజే మోదీతో భేటీ కాగలగడం గమనార్హం. ఈ ఇద్దరి విషయంలో ప్రధాని ఎందుకు ఇలా రెండు విధాలుగా వ్యవహరించారన్నది రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

ఉత్త చేతులతో కేసీఆర్ తిరుగు ప్రయాణం

వరి ధాన్యం కొనుగోళ్లు, నీటి వాటాల విషయంలో కేంద్రంతో అటో ఇటో తేల్చేసుకుంటామంటూ మంత్రులు, అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజులు ప్రయత్నించినా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించలేదు. మంత్రుల బృందం కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి చర్చించినా ఫలితం లేకపోయింది. తెలంగాణ నుంచి ఇక బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. పోనీ సాధారణ బియ్యం గురించైనా స్పష్టత ఇవ్వలేదు. దాంతో మంత్రుల బృందం ఇంకా ఢిల్లీలోనే ఉండగా కేసీఆర్ మాత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.

కేసీఆర్ తర్వాత ఢిల్లీ వెళ్లిన బెంగాల్ సీఎం మమతకు మాత్రం వెళ్లిన మరుసటి రోజే ప్రధాని అపాయింట్మెంట్ లభించింది. బీఎస్సెఫ్ అధికార పరిధి పెంపు ఉపసంహరణ, త్రిపుర-బెంగాల్ సరిహద్దుల్లో అల్లర్లు, రాష్ట్రానికి రూ.96 వేల కోట్ల విపత్తు నిధి వంటి అంశాలపై ఆమె ప్రధానితో చర్చించారు.

ఇద్దరూ బీజేపీ వ్యతిరేక సీఎంలే అయినా..

కేసీఆర్, మమత.. ఇద్దరూ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలే. మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారే. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కంటే మమత బీజేపీని, మోదీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడుతున్నారు. అయినా మమతకు తనను కలిసే అవకాశం ఇచ్చిన మోదీ కేసీఆర్ కు ఎందుకు ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికార తెరాస పార్టీతో బీజేపీ గట్టిగా పోరాడుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు శ్రమిస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి షాక్ ఇచ్చింది. అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలను చులకన చేస్తూ అవహేళన చేసే తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీలో మాత్రం బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ధీమాతోనే కేసీఆర్ తమను లెక్క చేయడంలేదని ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతోపాటు కలిసే అవకాశం ఇవ్వవద్దని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే కేసీఆర్ మూడు రోజులు నిరీక్షించినా మోదీ దర్శనం లభించలేదంటున్నారు. అయితే కేసీఆర్ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని లబ్ది పొందడానికి తప్పకుండా ప్రయత్నిస్తారని అంటున్నారు.

Also Read : Bjp.Modi – గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?