iDreamPost
android-app
ios-app

‘హిట్’ సీక్వెల్ లో ‘మేజర్’ హీరో

  • Published Nov 29, 2020 | 10:23 AM Updated Updated Nov 29, 2020 | 10:23 AM
‘హిట్’ సీక్వెల్ లో ‘మేజర్’ హీరో

ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ లో నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసుని దర్శకుడు శైలేష్ కొలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్ రూపొందుతుందని అప్పుడే ప్రకటించారు కానీ హీరో విషయంలో మాత్రం ట్విస్ట్ జరిగింది. ఇప్పుడీ సినిమాలోకి అడవి శేష్ వచ్చాడు. తనే లీడ్ రోల్ లో ఇది రూపొందనుంది. విశ్వక్ సేన్ చేయకపోవడానికి కారణాలు తెలియదు కానీ ఒకవేళ కొంత భాగం కనిపించేలా ఏదైనా స్క్రిప్ట్ లో మార్పు చేసుకున్నారేమో తెలియదు.

నిజానికి హిట్ కథ ప్రకారం హీరో మానసిక వ్యాధితో బాధ పడడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేంటి అనేది క్లూ ఇచ్చారు కానీ ఫస్ట్ పార్ట్ లో రివీల్ చేయలేదు. ఇప్పుడిది కంటిన్యూయేషన్ అంటే అడవి శేష్ ఆ పాత్ర చేస్తాడా లేదా పూర్తిగా స్టోరీనే మారిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. మిగిలిన టీమ్ మొత్తం యధావిధిగా అదే ఉంటుంది. షూటింగ్ వచ్చే నెల లేదా 2021 జనవరికి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. నానికి నిర్మాతగా హిట్ ఒక్కటే సంతృప్తినిచ్చిన చిత్రం. అ! పేరు తెచ్చింది కానీ వసూళ్లు రాలేదు. హిట్ అలాంటి సమస్య లేకుండా బడ్జెట్ కు తగ్గట్టు వసూళ్లు కూడా రాబట్టింది.

అడవి శేష్ ప్రస్తుతం మేజర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబుతో పాటు సోనీ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఈ భారీ ప్రాజెక్ట్ లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఇటీవలే రీ స్టార్ట్ చేశారు. ముంబై టెర్రరిస్ట్ ఎటాక్స్ లో పాల్గొన్న రియల్ ఆఫీసర్ బయోపిక్ గా రూపొందుతున్న మేజర్ బడ్జెట్ కూడా భారీగానే సెట్ చేసుకున్నారు. ఇది విడుదల అయ్యాకే హిట్ లో పాల్గొనవచ్చు. ఇది కాకుండా గూఢచారి సీక్వెల్ కూడా శేష్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. ఎవరు సిరీస్ లో మరో సినిమా చేస్తారనే టాక్ వచ్చింది. మొత్తానికి సీక్వెల్స్ తోనే శేష్ ఓ రెండేళ్లు ప్యాక్ అయ్యేలా ఉన్నాడు