Idream media
Idream media
అసెంబ్లీ సమావేశాల వేదికగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఏడాది పాటు బహిష్కరిస్తే, ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దే పోటీ సెషన్ నిర్వహిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలలోనే ఒకరు స్పీకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. లోపల ఓ అసెంబ్లీ, బయట సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల మరో అసెంబ్లీ నడుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
చిచ్చు రేపిన ఓబీసీ బిల్లు
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజే అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రవాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్.. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాకి సంబంధించి అనుభావిక డేటా సిద్దం చేసేందుకు సాధ్యపడేలా 2011 జనాభా లెక్కల డేటాని అందించాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మాణాన్ని అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి చగ్గన్ భుజ్ భల్ ప్రవేశపెట్టారు. దానికి నిరసనగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లింది. వారి ఆందోళన కొనసాగుతుండగానే, మూజువాణి ఓటు ద్వారా తీర్మాణాన్ని ఆమోదం తెలుపుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు.
పోడియంపైకి బీజేపీ ఎమ్మెల్యేలు
ఓబీసీ తీర్మానాన్ని ఓటింగ్ కి పెట్టిన సమయంలోనే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంపైకి ఎక్కి..స్పీకర్ తో వాదనకు దిగారు. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో.. సంజయ్ కూటె, ఆశిష్ షేలర్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భత్కాల్కర్, పరాగ్ అలావ్నీ, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్‌కుమార్ రావల్, యోగేశ్ సాగర్, నారాయణ్ కూచె, కీర్తికుమార్ బాంగ్డియా ఉన్నారు.
ఆరోపణలను కొట్టిపారేసిన ఫడ్నవిస్
అయితే, ఈ రభస జరుగుతుండగా కేబిన్ లో ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్.. తమ పార్టీ సభ్యులు ఎవరినీ దూషించలేదని, ఎవరిపైనా చెయ్యి చేసుకోలేదని కొట్టిపారేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. అసలిదంతా కట్టు కథ అని..తమ పార్టీ నుంచి ఎవరూ అనుచిత చర్యలకు పాల్పడలేదన్నారు. తొలుత ఓబీసీ సమస్యపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు తమను అనుమతించాలని కోరగా భాస్కర్ జాదవ్ ఇందుకు నిరాకరించారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే, విపక్ష సభ్యులు తన కేబిన్ లో ప్రవేశించి తనను దూషించారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని (దౌర్జన్యం) ..పైగా దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రకాంత పాటిల్ సమక్షంలోనే వారిలా ప్రవర్తించారని స్పీకర్ భాస్కర్ జాదవ్ పేర్కొన్నారు.
స్పీకరే మమ్మల్ని దూషించారు…
బీజేపీ ఎమ్మెల్యేల కథనం మరోలా ఉంది. భాస్కర్ జాదవ్ ని కలుసుకునేందుకు వెళ్లిన తమ సహచరులను ఆయన దూషించారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. ఈ రభస తాలూకు వీడియోను పోస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన రోజే తీరు ఇలా ఉందన్నారు. అటు-మాజీ స్పీకర్ నానాపటోల్ రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేబట్టడంతో కొత్త స్పీకర్ ను సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పోస్టు తమకే దక్కాలని బీజేపీ కోరుతోంది.
Also Read : బెంగాల్ రాజకీయాల్లో మరో మలుపు,మండలి ఎత్తుతో మమత ముందుకు!
బీజేపీ ఎమ్మెల్యేల పోటీ సభ
అంతటితో వివాదం సమసిపోలేదు. అసెంబ్లీ నుంచి తమ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ‘పోటీ సభ’ (సెషన్) నిర్వహించారు. ఈ సెషన్ లో స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ వ్యవహరిస్తారని మహారాష్ట్ర విధాన పరిషత్ లో విపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ని కలిసి తమ సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తమ సస్పెన్షన్ అనైతికమన్నారు. ఈ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని వారు దుయ్యబట్టారు.