iDreamPost
iDreamPost
Love Todayమూడు వారాల క్రితం తమిళంలోకి విడుదలైన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ లవ్ టుడే. తెలుగులో రీమేక్ చేయకుండా డబ్బింగ్ రూపంలో నిన్న విడుదల చేశారు దిల్ రాజు. స్టార్ క్యాస్టింగ్ లేని ఈ ఎంటర్ టైనర్ మీద చెన్నై మీడియా ప్రశంసలు ఓ రేంజ్ లో దక్కాయి. చాలా కాలం తర్వాత థియేటర్లు మొత్తం యూత్ తో నిండిపోవడం దీంతోనే చూశామని కథనాలు వచ్చాయి. అందుకే ఆ ఒరిజినల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు అనువాదం చేసి తీసుకొచ్చారు. ఉదయం రెండు మూడు ఆటల ఓపెనింగ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఫుల్ పికప్ తో మెల్లగా ఆడియన్స్ పెరగడం మొదలయ్యింది. అంతగా ఇందులో ఏముందో రిపోర్ట్ లో చూద్దాం.
ప్రదీప్(ప్రదీప్ రంగనాధన్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నిఖిత(ఇవానా)ని ఘాడంగా ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయిచుకుంటారు. విషయం తెలిసిన నిఖిత తండ్రి శాస్త్రి(సత్యరాజ్)వీళ్లకో విచిత్రమైన కండీషన్ పెడతాడు. ఇద్దరూ తమ తమ ఫోన్లను మార్చుకుని ఒక రోజంతా గడపాలని ఆ పరీక్ష పాస్ అయితే అప్పుడు లవ్ ని అంగీకరిస్తానని ట్విస్ట్ ఇస్తాడు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ నికితలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకళ్ళ కాల్స్ మరొకరు రిసీవ్ చేసుకోవడం మెసేజులు చూసుకోవడం మొదట సరదాగా ఉన్నా తర్వాత ఏం జరిగిందనేది తెరమీద చూడాలి. ఎలాంటి గ్లామర్ ఆకర్షణ లేని లీడ్ పెయిర్ తో ఇంత అవుట్ ఫుట్ ఇవ్వడం గొప్ప
లవ్ టుడే ప్రత్యేకత కథ కంటే కథనం సంభాషణల్లో ఉంది. చక్కని హాస్యంతో ఇప్పటి యువతరం ఆలోచనలు సమస్యలు అలవాట్లను దర్శకుడు ప్రదీప్ ఒడిసిపట్టుకున్న తీరు ఆకట్టుకుంది. క్లీన్ కామెడీతో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా విసుగు రాకుండా టైం పాస్ చేయిస్తాడు. రెండో సగంలో కొంత సాగతీత ఉన్నప్పటికీ అది మరీ అసంతృప్తిని కలిగించే స్థాయిలో లేదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యోగిబాబు, రవీనా పాత్రలు ఉపయోగపడ్డాయి. సత్యరాజ్, రాధికాల సీనియారిటీని వాడుకున్న తీరు బాగుంది. కొన్ని సీన్లు కేవలం యూత్ ని టార్గెట్ చేయడం కోసం పెట్టడంతో అవి చికాకు పెట్టినా ఫైనల్ గా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు లవ్ టుడే పైసా వసూలే అనిపిస్తుంది.