Yogi Babu Chutney Sambar Web Series Review And Rating In Telugu: ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి.. ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Yogi Babu Chutney Sambar Web Series Review And Rating In Telugu: ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి.. ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Tirupathi Rao
ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు పాన్ ఇండియా లెవల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ లో యోగిబాబుకు కూడా పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ విడుదలైందని మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు ‘చట్నీ- సాంబార్’. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఈ చట్నీ- సాంబారుతో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్ కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
కథ:
ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి(నిజాల్ గల్ రవి)కి అముద కేఫ్ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంత గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి.. అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడెన్ గా రత్నస్వామి మంచాన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ(అముద)ను ప్రేమించాడని.. ఆమెకు ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నాను అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా.. మన కుటుంబంలో ఒకడిగా చూసుకో అంటూ కోరతాడు. తండ్రి మాటను కాదనలేక కార్తిక్(చంద్రన్) తన బావ ఇలాంగో(నితిన్ సత్య), తమ హోటల్ లో పనిచేసే పీటర్(ఎలాంగో కుమారవేల్)ని తీసుకుని వెళ్తాడు.
చెన్నైకి వెళ్లిన వారికి వాళ్ల అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్(యోగిబాబు)ను చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే అముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టార్జితం మీదే బతుకుతున్నాడు. సొంతంగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్ లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ చట్నీకి ఫ్యాన్. రోజూ పార్సిల్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్లి సచిన్ కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్ కు ఈ విషయం చెప్పగానే చిర్రెత్తుకొస్తుంది. అయితే మాయ చేసి సచిన్ ను చెన్నై నుంచి ఊటీ తీసుకెళ్తారు. సచిన్ ను చూసిన తర్వాత రత్నస్వామి ప్రాణాలు విడుస్తాడు. పెద్దకర్మ వరకు ఉండాలి అంటూ సచిన్ ను కార్తిక్ చాలా ప్రాథేయ పడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకు అని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రియురాలి పేరును తనకు పెట్టాడు అనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు అముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్లు రిసీవ్ చేసుకుంటారా? అవమానించి పంపేస్తారా? అసలు చట్నీ- సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వెబ్ సిరీస్ ని కూడా సినిమా రేంజ్ లో.. అంతకన్నా ఎక్కువే ఊహించుకుంటున్నారు. సిరీస్ లో కూడా ట్విస్టులు ఉండాలని.. నరాలు తెగే ఉత్కంఠ ఉండాలని.. యాక్షన్ టన్నుల కొద్దీ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ లో అలాంటివి ఏమీ ఉండవు. కానీ, బలమైన కథ ఉంటుంది. ఒకసారి మీరు ఈ సిరీస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడా కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్స్ చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉంది. తనని, తన తల్లిని మోసం చేశాడు అని తెలిసి కూడా.. కార్తిక్ చూడగానే మంచి కుర్రాడిలా ఉన్నాడని.. అతని కోసం తన తండ్రి పెద్ద కర్మ వరకు ఉండేందుకు సచిన్ ఒప్పుకుంటాడు. అయితే తన గురించి కార్తిక్- ఇలాంగో- పీటర్ కి తప్పితే ఎవరికీ తెలియకూడదు అని కండిషన్ పెడతాడు. అయితే తండ్రికి ఇచ్చిన మాట కోసం కార్తిక్ మాత్రం సచిన్ తన అన్నయ్య అనే విషయాన్ని చెప్పాలని చాలానే ప్రయత్నాలు చేస్తాడు.
సాధారణంగా ఒక వెబ్ సిరీస్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో అలా కాదు.. ఉన్న ప్రతి క్యారెక్టర్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు ఈ సిరీస్ లో ఉన్న సోఫీని ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో, సచిన్ లవ్ ఇంట్రెస్ట్ లా చూపించవచ్చు. కానీ, సోఫియాకి ఒక మంచి బలమైన కథను అల్లారు. వేధించే తండ్రి, కట్టుకుని కష్టాలు పెట్టిన భర్త.. ఇలా చాలానే కథ ఉంటుంది. మరోవైపు సోఫీ తండ్రికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా చూపించి.. అతను కూడా డబ్బు కోసం కక్కుర్తి పడిన సీన్స్ పెట్టి ప్రతి క్యారెక్టర్ ని హైలెట్ చేశారు. ముఖ్యంగా డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. యోగిబాబు వేసే పంచులు కితకితలు పెడతాయి. తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా నవ్వుకునే అంత సింపుల్ గా ఉంటాయి. ఒకవైపు మెయిన్ కథను నడిపిస్తూ మరోవైపు ఫ్లాష్ బ్యాక్ ని చూపించిన తీరు బాగుంటుంది. ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది.
ఈ సిరీస్ మొత్తాన్ని యోగిబాబు ముందుండి నడిపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా కూడా తన తల్లి కోసం సచిన్ అక్కడే ఉండే ఎమోషన్ ని యోగిబాబు బాగా పండించాడు. ఇంక తండ్రి మాట కోసం మదనపడిపోయే పాత్రలో చంద్రన్ మెప్పిస్తాడు. వాణి భోజన్, నితిన్ సత్య, మైనా నందిని, ఎలాంగో కుమారవేల్, దీపా శంకర్, నిజల్గల్ రవి ఇలా ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఏ పాత్ర కూడా అసలు ఎందుకు ఉంది అనే భావన కలగదు. ఇంక ఈ సిరీస్ డైరెక్టర్ రాధామోహన్ ప్రేక్షకులకు కథ చెప్పాలి అనుకున్న తీరు చాలా బాగుంది. అంటే దీన్ని కేవలం ఒక కామెడీ సిరీస్ గా తీసుకోలేదు. దీనిని ఒక కుటుంబ కథా చిత్రంగా తీయాలి అనుకున్నాడు. దానిలో అదనంగా కామెడీని జోడించాడు. తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా కుదిరింది. ముఖ్యంగా యోగిబాబు వేసే పంచులు మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇంక ఈ సిరీస్ లో మీకు ప్రసన్న కెమెరా వర్క్ బాగా నచ్చుతుంది. మొత్తానికి మీరు ఇంటిల్లిపాది కలిసి నిరబ్యంతరంగా ఈ సిరీస్ ని చూడచ్చు. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.
చివరిగా: ఈ చట్నీ- సాంబార్ రుచి అమోఘం..
రేటింగ్: 3/5