iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో అవకాశాలు గట్టిగానే పడుతున్న తాప్సీ కొత్త సినిమా లూప్ లపేట మొన్న శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలయ్యింది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కోసమే తీసినట్టున్నారు. గతంలో చేసిన ప్రమోషన్లు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీని మీద అంతో ఇంతో ఆసక్తి నెలకొంది. ఈ మధ్య కాలంలో మేకర్స్ టైం లూప్ కాన్సెప్ట్ మీద ఆధారపడుతున్నారు. గతేడాది వచ్చిన శింబు మానాడు తమిళంలో పెద్ద హిట్టయ్యి తెలుగులోనూ రీమేక్ దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లూప్ లపేట కూడా అదే ఫార్ములాలోనే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
ఇది జర్మన్ సినిమా రన్ లోలా రన్ కు అధికారిక రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కేవలం గంటా ఇరవై నిముషాలు మాత్రమే ఉంటుంది. కానీ మన ఆడియన్స్ టేస్ట్ అండ్ ఓటిటి లెంగ్త్ కోసం ఏకంగా గంట పెంచేశారు. కథ గోవా నేపథ్యంలో సాగుతుంది. మాజీ అథ్లెట్ సవి(తాప్సీ) తన బాయ్ ఫ్రెండ్ సత్య(తాహిర్ రాజ్ బాసిన్)తో సహ జీవనం చేస్తుంటుంది. ఓ పార్సెల్ డెలివరీ విషయంలో సత్య చెసిన పొరపాటు వల్ల భారీ డబ్బున్న సంచిని పోగొట్టుకుంటాడు. దాన్ని తిరిగి తెచ్చివ్వడానికి యజమాని చాలా తక్కువ సమయం ఇస్తాడు. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ఇక్కడే సవి సత్యలు టైం లూప్ లో వెళ్తారు. మరి తర్వాత ఏమైందనేదే అసలు స్టోరీ.
లైన్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ దాకా కథనం ముందుకు సాగదు. దానికి తోడు టైం లూప్ చూపిస్తున్నా కదా ఇదే ఆడియన్స్ కి పెద్ద థ్రిల్ అని భ్రమపడ్డ దర్శకుడు ఆకాష్ మిగిలిన విషయాల్లో తగినంత శ్రద్ధ వహించకపోవడంతో రేసీగా పరిగెత్తాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా నత్తనడక సాగిస్తూ ఓపికకు పరీక్ష పెడుతుంది.అవసరం లేని సన్నివేశాలు కేవలం నిడివి కోసం ఇరికించడం బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా కొత్తదనం కనిపించినా ఓవరాల్ గా యావరేజ్ కంటే కిందే నిలిచిపోయింది. ఇలాంటి జానర్ మూవీస్ విపరీతంగా చూసేవాళ్ళకు పర్వాలేదనిపించొచ్చు కానీ రెగ్యులర్ ఆడియెన్స్ మాత్రం ఈ సాగతీతకు సారీ లపేట అనాల్సిందే.
Also Read : Rahul Ramakrishna : నమ్మిన వాళ్ళను ఫూల్స్ అనడం హాస్యమా