iDreamPost
iDreamPost
Peoples China,Communist China ఏర్పాటు లక్ష్యంగా ఎనిమిది దశాబ్దాల కిందట జరిగిన లాంగ్ మార్చ్ స్ఫూర్తి చైనా సమాజంలో ఇప్పటికి సజీవంగా ఉంది,”Think of the Long March; if you feel tired,Think of our revolutionary forebears ” అని ఇప్పటికి చెప్తుంటారు.
ఐక్య పోరాటాలు
స్వతంత్ర భారతంలో స్ఫూర్తిని ఇచ్చిన పోరాటాలు అతి స్వల్పం.ఎక్కువ పోరాటాలు కేవలం రాజకీయ లక్ష్యాలకే పరిమితం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2000 సంవత్సరంలో జరిగిన “విద్యుత్” ఉద్యమమే పోరాటం అనతగ్గది. విద్యుత్ పోరాటం ఆంధ్రప్రదేశ్లో బలమైన ఐక్య ఉద్యమాలకు పునాది వేసింది. తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెసుతో కలిసి పోరాడాయి.
2008లో అణువిద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో కూడా అప్పుడే ఏర్పడిన ప్రజారాజ్యాన్ని టీడీపీ కలుపుకోలేదు. ఇందిరాపార్క్ వద్ద టీడీపీ వామపక్షాల ధర్నాలో ప్రజారాజ్యం శ్రేణులు కొంచం దూరంగా నిలబడి నినాదాలు ఇచ్చాయి.కానీ వారికి వేదిక మీదికి ఆహ్వానం దక్కలేదు. ఆ తరువాత గుర్తుపెట్టుకోదగ్గ ఐక్య పోరాటాలు జరగలేదు.
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలకు పవన్ కళ్యాణ్ జనసేన unconditionalగా మద్దతు ఇచ్చింది.ఆ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాజకీయ పొత్తు,ఐక్య పోరాటాల అసలు అర్ధం ఏమిటో పవన్ కు అర్ధం అయ్యుంటుంది.రాజధాని గ్రామాలలో పవన్ పర్యటించినప్పుడు “ఒక రాయి” ఆయన పక్కనుంచి వెళ్ళింది. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారన్నా “అఖిలపక్షాన్ని” ఏర్పాటు చెయ్యలేదు. 2018లో ఒకే ఒకసారి అఖిల “సంఘాల” సమావేశం అని టీడీపీ కి చెందిన వ్యక్తులను పదుల సంఖ్యలో వివిధ సంఘాల పేరుతొ ఆ సమావేశంలో కూర్చోపెట్టారు. వామపక్షాలు ఆ సమావేశానికి వెళ్లి “మీతోకలిసి పోరాటం” చెయ్యం అని చెప్పి బయటకు వొచ్చేశాయి.
2019 ఎన్నికల తీర్పును కేవలం రాజకీయ తీర్పుగా పరిగణించకూడదు. గడచిన 5 సంవత్సరాలలో టీడీపీ ప్రభుత్వం,దానికి సంబంధించిన వ్యక్తులు చేసిన సామాజిక వాదనలు,ఆధిపత్య ధోరణులపట్ల ఆంధ్ర ఓటర్లు ఇచ్చిన తిరస్కారంగా గుర్తించాలి. ఓటమి తరువాత “ప్రజలను ఇంతగా బాధపెట్టామా?” అని ఆశ్చర్యాన్ని నటించాడు. ఓటమి తరువాత టీడీపీ ధైర్యంగా ప్రజలముందుకు రావటానికి కూడా సంశయించింది.
ఇప్పుడు జరుగుతున్న ఇసుక పోరాటం మీద ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ ఉన్న టీడీపీ చేసింది శూన్యం,ఆపార్టీ పెద్దనాయకులు మీడియాలో మాట్లాడటం తప్ప క్షేత్రస్థాయిలో ఒక ఇసుక ర్యాంపును ముట్టడించటం కానీ,ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను అడ్డుకోవటం కానీ చెయ్యలేదు. మొన్న ఎన్నికల్లో ఓటమి తరువాత ఆత్మస్థైర్యం కోల్పోయిన టీడీపీకి ఇప్పుడు ఒక “టార్చ్ బేరర్” కావాలి. పవన్ పట్టుకున్న ఇసుక బ్యాటన్ వెనుక టీడీపీ పరిగెత్తటానికి ఆరాటపడుతుంది. ఇసుక పోరాటంతో తిరిగి రాజకీయ స్రవంతిలో పరుగుతీయొచ్చన్న ఆలోచనలో టీడీపీ ఉంది.
ఇసుక సమస్య
ఇసుక సమస్య లేదని చెప్తే అది అబద్దం అవుతుంది. అయితే మీడియాలో చూపిస్తున్న స్థాయిలో ఇసుక సమస్య ఉందా? ఇసుక సమస్య ఇంతమంది ఆత్మహత్యలకు కారణం అయ్యిందా? టీడీపీ అధికారంలో లేనప్పుడు ఆంధ్రజ్యోతికి చిన్న చిన్న సమస్యలు కూడా యుగాంతం స్థాయిలో కనిపిస్తాయి. జూలై-నవంబర్ మధ్య ప్రతి సంవత్సరం ఇసుకకు ఎంత డిమాండ్ ఉంటుంది?2 దశాబ్దాలలో చూడని వరదలు వొచ్చినప్పుడు, నవంబర్ మొదటి వారంలో కూడా లక్షల క్యూసెక్కుల నీరు పారుతున్నప్పుడు ఇసుక లభ్యత ఎంత ఉంటుంది?భవన నిర్మాణ కార్మికులకు సిమెంట్ పని దొరక్కపోతే ఆత్మహత్యలే శరణ్యమా?ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?తదితర అంశాల మీద చర్చ లేకుండ ఏకపక్షంగా దాడి,సందుదొరికితే “ప్రజలు మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి”గా కోరుకుంటున్నారని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆత్మతృప్తి కలిగించటమే లక్ష్యంగా చర్చలు జరగటం దురదృష్టం.
పవన్ లాంగ్ మార్చ్ ని ఎలా చూడాలి?
“ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిద్దాం” అన్న అధికారపక్షం భవిషత్తు ఏమవుతుంది మొన్న ఎన్నికల్లో చూశాం.ఎన్నికల్లో గెలవాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకోవచ్చు కానీ ప్రతిపక్షం ఉండకూడదు అనుకోవటం నష్టాన్నీచేస్తుంది.2014 ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల నుంచే “ప్రతిపక్షం”గా వైసీపీ విఫలమయ్యింది అని చంద్రబాబు,ఆంధ్రజ్యోతి అనటంతోనే టీడీపీ పతనానికి నాందిపడింది.
ఇప్పట్లో టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని పోరాడిన వామపక్షాలు లేకుండ,పచ్చజండాలతో టీడీపీ శ్రేణులు పాల్గొనే లాంగ్ మార్చ్ చిత్తశుద్ధిని శంకించేలాచేస్తుంది. అఖిలపక్షం మీద నమ్మకంలేని చంద్రబాబుతో కలిసి ఐక్యపోరాటం చేస్తామనటం మీ పోరాటంపట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించదు .చంద్రబాబు నాయకత్వంలోకి వొచ్చిన తరువాత టీడీపీ ఏరోజు ప్రతిపక్షపాత్ర సమర్ధవంతంగా పోషించలేదు. పవన్ భుజాల మీద తుపాకిని పెట్టి ప్రభుత్వాన్ని కాల్చుదామన్న ఆరాటం తప్ప సమస్యల సాధనకి టీడీపీ ప్రయత్నం చేసిందే లేదు.
ఈ రోజు లాంగ్ మార్చులో రాజకీయ విమర్శలకు దిగకుండా ,కేవలం ఇసుక సమస్య మీద మాత్రమే మాట్లాడి,బాధితుల వివరాలతో ముఖ్యమంత్రిని కలవండి. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవటంతో పాటు చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వమని అడగండి. ఈ విషయాన్ని లాంగ్ మార్చ్ లోనే ప్రకటించి టీడీపీ నాయకుల స్పందనను అడగండి,వారి చిత్తశుద్ధి బయటపడుతుంది.
మొత్తంగా టీడీపీ ప్రభావం నుంచి బయటపడి స్వీయ రాజకీయం చెయ్యటం జనసేనకు మంచిది .