అదీ.. ‘మందు’ చూపంటే..!

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల అన్ని వర్గాలతోపాటు మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, మందుల లభ్యతకు ఎలాంటి ఢోకా లేకుండా సాగింది. సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మద్యం మాత్రం అందుబాటులో లేకపోవడంతో మందుబాబుల బాధ వర్ణణాతీతం. చుక్క వేస్తేనే రోజు ప్రారంభమవని మందుబాబులు లాక్‌డౌన్‌ సమయంలో పిచ్చెక్కి ప్రవర్తించారు. కొంత మంది ఆస్పత్రి పాలయ్యారు.

తమ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మందుబాబులు కలలో కూడా ఊహించలేదు. మద్యం దుకాణాల సమయవేళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా కూడా 24 గంటలూ మద్యం ఏదో ఒక విధంగా లభించేంది. తెల్లవారుజామున టీ దుకాణాలు తెరవకముందే మద్యం దుకాణాల వెనుక డోరు తెరిచేవారంటే ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితిని నుంచి దాదాపు రెండు నెలల పాటు చుక్క దొరకని పరిస్థితికి కరోనా లాక్‌డౌన్‌ మందుబాబులను తీసుకొచ్చింది.

గత అనుభావాలను దృష్టిలో పెట్టుకున్న మందుబాబులు ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, పెరుగుతున్న కేసులపై ఓ కన్ను వేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉంటాయి..? మీడియాలో కథనాలు ఎలా వస్తున్నాయి..? అనే అంశాలపై భవిష్యత్‌ను ఊహిస్తున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మరోమారు లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరస్‌ అవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ‘మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారట కదా’ అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మందుబాబులు అప్రమత్తం అయ్యారు. మళ్లీ లాక్‌డౌన్‌ పెడితే చుక్కకు చిక్కులు లేకుండా ‘మందు’ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. అవసరమైన సరుకును స్టాక్‌ చేసుకునేందుకు కొనుగోళ్లకు దిగుతున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈ రోజు సోమవారం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారుతీరడం వెనుక కథ ఇదే కావడం గమనార్హం. లాక్‌డౌన్‌ తర్వాత మద్యం దుకాణాలు తెరిచిన ముందు రోజు ఏ స్థాయిలో రద్దీ ఉందో.. ఈ రోజు కూడా అదే స్థాయిలో మద్యం దుకాణాల వద్ద రద్దీ ఉండడం విశేషం.

Show comments