లాక్‌డౌన్‌ పొడిగింపుపై మోదీ సమాలోచనలు

ఈ నెల 14వ తేదీతో ముగియబోతున్న లాక్‌డౌన్‌ను పొడిగించాలా..? లేదా..? అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి..? వాటిని ఎలా ఎదుర్కొవాలి..? అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమాలోచనలు జరుపుతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాక్‌డౌన్‌ను మరో వారం లేదా రెండు వారాలపాటు పొడిగించాలన్న డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను తీసుకుంటుండడం చర్చనీయాంశమైంది.

ఈ రోజు ప్రధాని మోదీ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణపై చర్యలు, లాక్‌డౌన్‌ పొడిగింపుపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారనే ప్రచారం సాగుతున్న వేళ ప్రధాని ప్రతిపక్ష పార్టీల అభిప్రాయలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు తప్పకుండా ఉంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా వైరస్‌ దేశంలో వ్యాపించకుండా లాక్‌డౌన్‌ విధించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. అమెరికా, యూరప్‌ ఖండంలోని దేశాలు, పశ్చిమాసియా కరోనా వైరస్‌తో వణికిపోతుండగా.. భారత్‌లో వైరస్‌ ప్రభావం గణీయంగా తగ్గించడంలో లాక్‌డౌన్‌ ఉపయోగపడింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసులు రోజూ నమోదవుతుండడంతో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగించాలనే డిమాండ్‌లు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం సీఎంలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా దేశంలో పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది.

Show comments