iDreamPost
android-app
ios-app

నియంత్రణ మీ చేతిలో లేదు ముఖ్యమంత్రి గారు..!

నియంత్రణ మీ చేతిలో లేదు ముఖ్యమంత్రి గారు..!

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఊహకందని విధంగా ఉంది. వైరస్‌ మహమ్మారి విజృంభనకు ఎలా అడ్డుకట్ట వేయాలో ప్రభుత్వాలకు అంతుబట్టడం లేదు. నియంత్రించేందుకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో గత సోమవారం ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీన్ని ఈ రోజు మరోమారు పొడిగించింది. సోమవారం నుంచి రేపు సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ప్రకటించిన కేజ్రీవాల్‌.. దాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించారు. వచ్చే నెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని వెల్లడించారు.

లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయంతో.. వైరస్‌ నియంత్రణలోకి ఎప్పుడు వస్తుంది..? రేపటి పరిస్థితి ఏమిటి..? అనేది పాలకులు అంచనా వేయలేరని స్పష్టం చేస్తోంది. గత సోమవారం ఉదయం లాక్‌డౌన్‌పై కేజ్రీవాల్‌ ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయంతో వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. కార్మికులను వెళ్లవద్దని, ఇది స్వల్పకాలిక లాక్‌డౌన్‌ మాత్రమేనంటూ కేజ్రీవాల్‌ వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. ఐదు రోజుల క్రితం మాటలకు భిన్నంగా నేడు మరో వారం రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్‌ చెప్పడం కరోనా నియంత్రణలో పాలకులు వ్యవహరిస్తున్న స్థితిని తెలియజేస్తోంది.

గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వలస కార్మికులు.. పాలకులను నమ్మడం మానేశారు. అందుకే కేజ్రీవాల్‌ నచ్చజెప్పినా.. ఎలాంటి ఇబ్బందులు రానీయబోమని హామీ ఇచ్చినా నమ్మలేదు. స్వస్థలాలకు వెళ్లిపోయారు. వలసజీవులు ఢిల్లీని వదిలి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడమే మంచిదైంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా బాధితులకు వైద్యం అందించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. కరోనా వైరస్‌ కన్నా.. ఆక్సిజన్‌ కొరతతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మళ్లీ సాధారణ స్థితి ఎప్పటికి ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. వలస కార్మికులు కూడా ఢిల్లీలో ఉంటే.. వారికి ఆహారం, వసతి కల్పించడం ఢిల్లీ ప్రభుత్వానికి మరింత కష్టమయ్యేది.

Also Read : కేజ్రీవాల్ కూడా అంతేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి