iDreamPost
iDreamPost
కరోనా తెచ్చిన లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ నటీనటుల్లోనూ వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి పెరిగింది. నోటెడ్ ఆర్టిస్టులు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా డెబ్యూ చేసిన ప్రొడక్షన్ షూట్ అవుట్ అట్ అలైర్. అప్పుడెప్పుడో సిద్ధార్థ్ తో ఓయ్ తీసిన ఆనంద్ రంగా దీనికి దర్శకుడు. ఎపిసోడ్ల వారిగా రూపొందించిన ఈ సిరీస్ లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి పేరున్న తారాగణం ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. జీ 5 ద్వారా విడుదలైన ఈ కాప్ యాక్షన్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ
హైదరాబాద్ నగరంలో జరిగిన మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా ఆ ఘటన జరిగిన రోజు ప్రతి సంవత్సరం పోలీసులను చంపడం టార్గెట్ గా పెట్టుకుంటాడు ముస్లిం తీవ్రవాది అక్తర్(తేజ). అయితే ఇతని జాడ దొరక్క డిపార్ట్మెంట్ మొత్తం తలకిందులు అవుతుంది. వరంగల్ ఐజి ప్రవీణ్ చంద్(శ్రీకాంత్)దీని తాలూకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అనుకోకుండా ఓ అనూహ్య సంఘటనలో ఆక్టోపస్ డిప్యూటీ ఎస్పి సూర్యనారాయణ(ప్రకాష్ రాజ్)కు అక్తర్ దొరుకుతాడు. ఆ తర్వాత స్టోరీ అసలు మలుపులు తిరుగుతుంది.
నటీనటులు
ఇందులో మన ప్రేక్షకులకు పరిచయమున్న నటులు కొందరే. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తమ పాత్రల మేరకు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్లకంటూ సొంతమైన టైమింగ్ ని వాడుకునే అవకాశం దర్శకుడికి దక్కలేదు. ఇంకెవరైనా చేసుంటే నిండుతనం వచ్చేది కాదు కాబట్టి స్టార్ వేల్యూ తీసుకున్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. శ్రీకాంత్ తో పోలిస్తే ప్రకాష్ రాజ్ కు ఇచ్చిన స్పాన్, సన్నివేశాలు చాలా తక్కువ.
టెర్రరిస్ట్ గా నటించిన తేజకు మంచి మార్కులు పడతాయి. కసితో రగిలిపోయే ముస్లిం తీవ్రవాదిగా చక్కని నటన ప్రదర్శించాడు. రవికాలే కనిపించేది కాసేపే. గాయత్రి గుప్తాకు కూడా డీసెంట్ రోల్ దక్కింది. మిగిలిన యాక్టర్స్ అందరూ కొత్త మొహాలే. నందిని రాయ్, సందీప్ సాహు, కిరణ్ కామరాజు, సుదీర్ వర్మ, రఘు, పవన్, రజాక్ తదితరులు మిగిలిన క్యాస్టింగ్. కొందరు బాగానే సెట్ అయినప్పటికీ ఇంకొందరు మాత్రం సోసోగా అనిపించారు.
డైరెక్టర్ అండ్ టీమ్
దర్శకుడు ఆనంద్ రంగ ఈ సిరీస్ కోసం 2007లో వచ్చిన బాలీవుడ్ మూవీ షూటవుట్ అట్ లోఖండ్ వాలాను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. తీసుకున్న ప్లాట్ ఈ మధ్యకాలంలో ఎవరూ టచ్ చేయనిది కావడంతో మొదలైన కాసేపటికే ఏదో కొత్తగా చూస్తున్నట్టు ఫీలవుతాం. దానికి తగ్గట్టే మొదటి ఎపిసోడ్ ఫస్ట్ సీన్ లోనే చార్మినార్ దగ్గర ఓ పోలీసుని అక్తర్ చంపడంతో మొదలుపెడతాడు. ఆ తర్వాత క్రమమే నెమ్మదిగా సాగుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లకు ఎనిమిది క్యారెక్టర్లను సెట్ చేసుకుని వాళ్లకు అక్తర్ కు లింక్ పెట్టడం ద్వారా ఆనంద్ రంగా సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఫార్మాట్ బాగుంది.
గతాన్ని వర్తమానాన్ని ప్యారలల్ గా చూపిస్తూ నాన్ లీనియర్ తరహా టేకింగ్ ని ఎంచుకున్న రంగా దీన్ని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా మార్చలేకపోయాడు. అయినప్పటికీ మరీ విసుగు రాకుండా ఇలాంటి కథల పట్ల ఆసక్తి ఉన్న ఆడియన్స్ ని ఫార్వార్డ్ చేయకుండా చూసేలా రంగా జాగ్రత్త పడ్డాడు. కానీ అసలైన షూటవుట్ ఎపిసోడ్ మాత్రం చివరి దాకా రివీల్ చేయకుండా అలా సాగదీశారు. ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి ముందు వెనుకా జరిగిన పరిణామాలు ఏవీ చూపించలేదు. కేవలం పోలీసులను అక్తర్ చంపడం, ఆ ఘటనలు, పరిణామాలు మాత్రం చూపిస్తూ మేనేజ్ చేశారు. ఇదంతా కొంతమేర ఆసక్తికరంగానే ఉంది.
ఆనంద్ రంగలో కంటెంట్ ఉన్న మాట వాస్తవం. సెకండ్ సీజన్ కోసం ఇప్పుడీ ఫస్ట్ సిరీస్ ని ఇలా డీల్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. చాలా చోట్ల ఉండాల్సిన గ్రిప్ కంటే తక్కువ స్థాయిలో కథనం సాగుతుంది. అయితే ఆర్ట్ వర్క్, లొకేషన్స్ విషయంలో రంగా తీసుకున్న శ్రద్ధ మంచి అవుట్ ఫుట్ అయితే ఇచ్చింది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం రేసీగా మార్చుకుని ఉంటే బాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఇది కూడా నిలిచిపోయేది. అయినా కూడా బ్యాడ్ ప్రోడక్ట్ మాత్రం కాదు. నరేష్ కుమరన్ సంగీతం పర్వాలేదు. అనిల్ బండారి ఛాయాగ్రహణం సినిమా స్థాయిలో ఉంది. ఆది నారాయణ్ ఎడిటింగ్ ఓకే. విష్ణు ప్రసాద్, సుస్మిత ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కంక్లూజన్
యాక్షన్ డ్రామాలను బాగా ఇష్టపడే వారికి షూటవుట్ అట్ అలైర్ ఓ మోస్తరుగా టైం పాస్ చేయిస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం కొంత ఓపిగ్గా చూస్తే తప్ప అంతగా కనెక్ట్ కాదు. సాధారణంగా బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా తీసే ఇలాంటి టెర్రరిజం బ్యాక్ డ్రాప్ సిరీస్ ని ఇక్కడ కూడా మొదలుపెట్టడం హర్షించదగిన పరిణామం. కాకపోతే స్క్రీన్ ప్లే, నెరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటే ఎక్కువ శాతం ప్రేక్షకులకు ఇవి ఇంకా బాగా రీచ్ అవుతాయి. మొత్తం అయిదు గంటలకు పైగా నిడివి ఉన్న సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది. రామ్ కామ్ కథలతో బోర్ కొట్టిన ఓటిటి వ్యూయర్స్ కి ఎంతో కొంత రిలీఫ్ అయితే ఇస్తుంది. పూర్తిగా మాత్రం కాదు.