iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 59 – మా వింత గాథ వినుమా

  • Published Nov 13, 2020 | 7:17 PM Updated Updated Nov 13, 2020 | 7:17 PM
లాక్ డౌన్ రివ్యూ 59 – మా వింత గాథ వినుమా

ఇటీవలి కాలంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, ఇండిపెండెంట్ మూవీస్ తో దూసుకుపోతున్న ఆహా ఇవాళ జరిపిన గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా మా వింత గాథ వినుమాను విడుదల చేసింది. అసలు ఇది ఎప్పుడు తీశారో ఎవరికీ ఐడియా లేదు కానీ షూటింగ్ మాత్రం గప్ చుప్ గా జరిగిపోయినట్టు ఉంది. ఆ మధ్య కృష్ణ అండ్ హిజ్ లీలతో యూత్ ని బాగానే ఆకట్టుకున్న సిద్దు జొన్నలగడ్డ అదే తరహాలో తనే రాసి ఎడిట్ చేసుకుని నటించిన సినిమా ఇది. ట్రైలర్ వచ్చాక ఎంతో కొంత అంచనాలు రేపిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

సిద్దు(సిద్దు జొన్నలగడ్డ) ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల నుంచే క్లాస్ మేట్ వినీత వేణుగోపాల్(సీరత్ కపూర్) ను గాఢంగా ప్రేమిస్తాడు. మొదట్లో ఆమె తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటుంది. వినీత అన్నయ్య కార్తీక్(కమల్ కామరాజ్)ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం గోవాకు వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య అపార్థాలు మొదలవుతాయి. ఆ తర్వాత బాగా మందు కొట్టిన మైకంలో విచిత్రమైన పరిస్థితుల్లో సిద్దు వినీతల పెళ్లి జరిగిపోతుంది. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో రెండు కుటుంబాల పరువు ఇబ్బందుల్లో పడుతుంది. దీంతో కార్తిక్ పెళ్లి రద్దవుతుంది. సిద్దూ తొందరపాటు పని వల్ల ఈ జంట విడిపోతుంది. ఇప్పుడీ సమస్యను సిద్ధూ ఎలా అధిగమించి చిక్కుముడులు విప్పదీశాడో అదే అసలు స్టోరీ

నటీనటులు

సిద్దుకిది టైలర్ మేడ్ పాత్ర. తనకు ఇలాంటి లవ్ స్టోరీస్ తప్ప ఇంకేవి సూట్ కావని డిసైడ్ అయ్యాడు కాబోలు ఇంతకు ముందు పేరు తెచ్చిన సినిమాల టెంప్లెట్ లోనే దీన్నీ రాసుకున్నాడు. కాకపోతే కంటెంట్ లో కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ ఉండటంతో పాటు అన్ని ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్త పడటంతో ఎక్కువ వేరియేషన్స్ చూపించుకోవడానికి అవకాశం దొరికింది. గొప్పగా నటించేశాడు, బెస్ట్ యూత్ యాక్టర్ అని చెప్పేసుకోవడం తొందరపాటుతనం అవుతుంది కానీ ఇంకాస్త టిపికల్ రోల్స్ కూడా ట్రై చేస్తే బెటర్. లేదంటే ఇంకో రెండు మూడు ఇలాంటివే చేస్తే బోర్ కొట్టే అవకాశం ఉంది.

రన్ రాజా రన్ తో పేరు తెచ్చుకుని తర్వాత మాయమైపోయి చాలా గ్యాప్ తీసుకున్న సీరత్ కపూర్ కు ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర దొరికింది ఇందులోనే. హెయిర్ స్టైల్ కూడా పద్ధతిగా చేసుకుని చాలా హోమ్లీగా మారిపోయింది. నటన పరంగా యావరేజ్ అనిపించుకుంది తప్ప మరీ గొప్పగా చెప్పుకునే ఎక్స్ ప్రెషన్స్ తనలో పలకలేదు. డబ్బింగ్ తో కొన్ని లోపాలు కవరైపోయాయి. తనికెళ్ళ భరణి ప్రత్యేక పాత్రలో మెరవడం బాగుంది. కమల్ కామరాజ్ ది రెగ్యులర్ పాత్రే. కల్పిక గణేష్ కు ఎక్కువ స్పేస్ దొరికింది. ప్రగతి, జయప్రకాశ్, శిశిర్ శర్మ, వైవా హర్ష, ఫిష్ వెంకట్ తదితరులవి చిన్న పాత్రలే అయినా తమ ఉనికిని చాటుకునే స్కోప్ దక్కింది

డైరెక్టర్ అండ్ టీం

దర్శకుడు ఆదిత్య మందల తీసుకున్న పాయింట్ లో ఉన్న కొత్తదనం అంతా సోషల్ మీడియా వల్ల ఎదురవుతున్న వైపరీత్యాలను చూపించడమే. ముప్పావు గంటకు పైగా రొటీన్ గా సాగే లవ్ స్టొరీని ఇంజనీరింగ్ కాలేజీలో నడిపించిన ఆదిత్య ఆ తర్వాత అసలు ట్విస్ట్ ని ప్రవేశపెట్టి కాస్త వేగం పెంచాడు. నిజానికి హీరో హీరొయిన్ మధ్య లవ్ ట్రాక్ అంత కన్విన్సింగ్ గా మొదలుకాదు. చాలా క్యాలికులేటెడ్ గా ఉండే వినీత అంత ఈజీగా సిద్దుకు ఎస్ చెప్పడం లాజిక్ కి దూరంగా ఉన్నా అంతకన్నా ఎక్కువ సాగదీస్తే బోర్ కొట్టేస్తుందని ఆపేయడం ఒకరకంగా తెలివైన పనే.

నిడివిని కేవలం గంటా నలభై నిమిషాలకే పరిమితం చేయడం అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇది థియేట్రికల ఎక్స్ పీరియన్స్ కోసం తీశారో లేదో కానీ ఓటిటికి మాత్రమే ఇలాంటి కాన్సెప్ట్స్ వర్కవుట్ అవుతాయన్నది నిజం. ఓ చిన్న పాయింట్ తో జస్ట్ ఓకే ఎంటర్ టైన్మెంట్ తో వంద రూపాయలు పెట్టి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. అందుకే ఇలాంటివి థియేటర్లలో వారం పది రోజుల కంటే ఎక్కువ నిలవవు. కథనం ఫ్రెష్ గా అనిపించినా సన్నివేశాలు మాత్రం రొటీన్ గానే అనిపించడం మా వింత గాధ వినుమాలోని ప్రధాన మైనస్. దాన్ని భరించగలిగితే మరీ టైం వేస్ట్ కలిగిన ఫీలింగ్ రాదు.

శ్రీచరణ్ పాకాల పాటలు ఫ్లోలో అలా వెళ్ళిపోయాయి కానీ మరీ గుర్తుండిపోయే మెలోడీస్ అయితే కాదు. రోహిత్ జాయ్ ల బిజిఎం స్కోర్ పర్వాలేదు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ తక్కువైనా తన పనితనంతో మంచి క్వాలిటీ వచ్చేందుకు కృషి చేశాడు. సిద్ధూతో కలిసి వంశీ అట్లూరి చేసిన ఎడిటింగ్ నీట్ గా ఉంది. అనవసర సీన్స్ ని తగ్గించబట్టే లెంత్ ఈ మాత్రం లిమిటెడ్ గా వచ్చినట్టు ఉంది. సిల్లీ మాంక్స్ ప్రొడక్షన్ బాగుంది. సింపుల్ స్క్రిప్ట్ కి తగ్గట్టు ఖర్చు పెట్టారు. చిన్న పాత్రలకు బిజీ ఆర్టిస్టులను ఎంచుకోవడాన్ని మెచ్చుకోవచ్చు.

ప్లస్ గా అనిపించేవి

సిద్దు యాక్టింగ్
కథలో మెయిన్ ట్విస్ట్
తారాగణం
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

తక్కువ నిడివిలోనూ ల్యాగ్
రెగ్యులర్ లవ్ ట్రాక్
యావరేజ్ సాంగ్స్

కంక్లూజన్

ఓటిటి కోసమే అన్నట్టు రూపొందుతున్న మా వింత గాథ లాంటి సినిమాలు టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ కు తగ్గట్టే ఉన్నాయి. టేకాఫ్ తో రెగ్యులర్ ప్రేమకథలాగే అనిపించినా సోషల్ మీడియా వైపరిత్యాలను హీరో హీరోయిన్ పెళ్లితో ముడిపెట్టిన ఆలోచన బాగుంది. పిల్లల పెంపకంలో స్వేచ్ఛ మితిమీరితే తల్లితండ్రులు పడే ఇబ్బంది కూడా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో కొంత కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా నుంచి ఎక్కువ ఊహించుకోకుండా జస్ట్ టైం పాస్ అయితే చాలు అనుకునే ప్రేక్షకులకు పండగ పూట ఫుల్ మీల్స్ పెట్టకపోయినా మరీ తీవ్రంగా అయితే నిరాశపరచదు. కాకపోతే కాస్తంత ఓపిక తప్పదు.

మా వింత గాథ వినుమా – రొటీన్ ప్లస్ వెరైటీ