iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 58 – లూడో

  • Published Nov 12, 2020 | 12:19 PM Updated Updated Nov 12, 2020 | 12:19 PM
లాక్ డౌన్ రివ్యూ 58 – లూడో

దీపావళి పండగను పురస్కరించుకుని ఈసారి ఓటిటిలో కొత్త సినిమాల ఫెస్టివల్ జోరుగా ఉంది. ప్రధాన భాషలు అన్నింటిలోనూ క్రేజీ మూవీస్ క్యూ కడుతున్నాయి. థియేటర్లు చాలా రాష్ట్రాల్లో తెరుచుకున్నప్పటికీ ఇప్పుడు వస్తున్నవన్నీ ముందే డీల్ చేసుకున్నవి కావడంతో వాటి నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన మూవీనే లూడో. అనురాగ్ బసు దర్శకత్వంలో క్వాలిటీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ట్రైలర్ చూశాక మంచి హైప్ వచ్చింది. మరి పేరుకు తగ్గట్టు అంచనాలు అందుకునేలా లూడో ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఇదో బ్లాక్ కామెడీ కం క్రైమ్ ఎంటర్టైనర్. నలుగురు జీవితాలతో ముడిపడిన ఒక అండర్ వరల్డ్ డాన్ బయోపిక్ లాంటిది. ఆకాష్(ఆదిత్య రాయ్ కపూర్)వెంట్రిలాక్విస్ట్. తన ప్రమేయం లేకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సెక్స్ చేసిన వీడియో ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం కావడంతో అది తీయించేందుకు సత్తు భయ్యా ఉరఫ్ సత్యేంద్ర త్రిపాఠి(పంకజ్ త్రిపాఠి)ని కలుస్తాడు. సత్తు దగ్గర గతంలో పని చేసి మానేసి వెళ్లిన బిట్టు(అభిషేక్ బచ్చన్)మాజీ ప్రియురాలి భర్తను విడిపించడం కోసం ఇతనూ అక్కడికి వస్తాడు.

హోటల్ నడుపుకునే అలోక్ కుమార్(రాజ్ కుమార్ రావు)తన ఎక్స్ లవర్ భర్త ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో అతన్ని విడిపించే బాధ్యత తీసుకుంటాడు. దాన్ని సత్థు చేసి ఉంటాడు. షాపింగ్ మాల్ లో పని చేసే రాహుల్(రాహుల్ సురేష్ సరఫ్)సత్తు చేసిన ఓ మర్డర్ చూడటంతో అక్కడ ఇరుక్కుంటాడు. ఇలా వీళ్లంతా ఒక చోట చేరాక సత్తు భాయ్ డెన్ బాంబుల వల్ల పేలిపోతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన డ్రామా. ప్రతి ఒక్కరికి మరొకరితో లింక్ ఉంటుంది. చిత్ర విచిత్రమైన కనెక్షన్లు ఉంటాయి. అందులో నుంచి ఎలా బయటికి వచ్చారు అనేదే లూడో స్టోరీ

నటీనటులు

ఇందులో అందరికి సమాన ప్రాధాన్యం దక్కడంతో ఎవరు బాగా చేశారు అనే ప్రశ్నకు తావు లేదు. అందరికీ స్క్రీన్ స్పేస్ దొరికింది. కాకపోతే ఇటీవలి కాలంలో మిర్జాపూర్ పుణ్యమాని బాగా పాపులర్ అయిన పంకజ్ త్రిపాఠి పాత్ర మధ్యలో చాలా సేపు కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యక్షమై అభిమానులకు ఊరట కలిగిస్తాడు. అభిషేక్ కపూర్ కి ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఇచ్చారు. మరీ గొప్పగా అనిపించదు అలా అని మరీ చప్పగానూ ఫీలవ్వం. ఆదిత్య రాయ్ కపూర్ జస్ట్ ఓకే. ఈ రోల్ ఎవరు చేసిన ఒకటే. రాజ్ కుమార్ రావు మాత్రం తన సీన్స్ వరకు చెలరేగిపోయాడు.

తనను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయి తన దగ్గరకు సహాయం కోసం వస్తే ఆమె బాబుని ఎత్తుకుని మరీ హెల్ప్ చేసేందుకు తెగబడటం బాగుంది. ఫాతిమా సనా షేఖ్, సాన్య మల్హోత్రా, పెర్ల్ మన్నే, ఇనాయత్ వర్మ, పరితోష్, ఆశ నాగి, షాలిని వత్సా, సౌరభ్ శర్మ, గీతాంజలి, ఇస్తాఖ్ ఖాన్, అమన్ భగత్ తదితరులు వాళ్ళ పాత్రలకు చాలా న్యాచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే వేషాలు ఇవ్వడంతో న్యాచురల్ గా చేశారు. ఎవరూ బ్యాడ్ ఛాయస్ అనిపించేలా చేయకపోవడం క్యాస్టింగ్ పరంగా లూడోకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్

డైరెక్టర్ అండ్ టీమ్

విలక్షణ దర్శకుడిగా పేరున్న అనురాగ్ బసు లూడో కోసం తీసుకున్న ప్లాట్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అంతే మోతాదులో గందరగోళం కూడా ఉంది. సినిమా మొదలైన చాలాసేపు పాత్రల పరిచయంతోనే గడిచిపోతుంది. వివిధ రకాల వ్యక్తులు వాళ్ళ మధ్య సంఘటనలు ఇంటర్ లింక్ చేసే క్రమంలో సమయం బాగా వృధా అయ్యింది. ఓ గంట గడిచాక కథ ఏంటి ముందుకు జరగడం లేదన్న భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లేతో అనుసంధానించే క్రమంలో కొంత సాగతీత జరగడంతో బోర్ కొట్టేస్తుంది. ఆఖరి నలభై నిమిషాల వరకు ఇదే తంతు. ఇలాంటి వాటిని ప్రత్యేకంగా ఇష్టపడే ప్రేక్షకులకు ఓకే కానీ ఈ ఫార్మట్ మిగిలినవాళ్లుకు ఇబ్బందే.

మల్టిపుల్ క్రైమ్స్ ఉన్న సినిమాల్లో కథనం వేగంగా ఉండటం చాలా అవసరం. కథలో భావోద్వేగాలను జొప్పించాలనుకున్నప్పుడు సరైన మీటర్ ని సెట్ చేసుకోవాలి. ఆలా కాకుండా లిమిట్ ని మించి వాటిని ఇరికిస్తే లూడో తరహాలో విసుగు తెప్పిస్తాయి. అనురాగ్ బసు తను చెప్పే కథలో అన్ని అంశాలు ఉండాలని కోరుకున్నారు కానీ కామెడీతో స్క్రిప్ట్ ని డామినేట్ చేయించినప్పుడు ఎమోషన్స్ కు అంత పెద్ద పీఠ వేయనక్కర్లేదు. కాకపోతే ఇంత గజిబిజిలోనూ మొదట్లో కొంత అయోమయానికి గురి చేసినా ఆఖరికి అన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వడం అనురాగ్ బసు చేసిన తెలివైన పని. ఫైనల్ గా లూడో యావరేజ్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

ప్రీతం సంగీతం ఓ మోస్తరుగా ఉంది. పాటలు ఏవీ గుర్తుపెట్టుకునేలా లేవు. థీమ్ కు తగ్గట్టు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనవసర శబ్దాలు చేయకుండా డీసెంట్ గా ఉంది. స్వయానా తానే సినిమాటోగ్రాఫర్ కావడంతో రాజేష్ శుక్లాతో కలిసి అనురాగ్ బసు చూపించిన కెమెరా పనితనం అడుగడుగునా మంచి స్టాండర్డ్ లో సాగింది. అజయ్ శర్మ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే ఓ పావు గంట నిడివి తగ్గి స్పీడ్ పెరిగేది. టి సిరీస్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే భారీగా ఉన్నాయి. సబ్జెక్టు ఎంత డిమాండ్ చేస్తే అంత ఖర్చు పెట్టే పాలసిని ఇందులో కూడా ఫాలో అయ్యారు.

కంక్లూజన్

ఒక తరహా డిఫరెంట్ టోన్ లో సాగే బ్లాక్ క్రైమ్ కామెడీలను ఎంజాయ్ చేసే వాళ్లకు లూడో జస్ట్ ఓకే మూవీగా అనిపిస్తుంది కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఫుల్ మీల్స్ ఫీలింగ్ ఇవ్వదు. కాకపోతే అందరూ అనుభవం ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ లతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండటంతో బ్యాడ్ క్యాటగిరీలో పడకుండా తప్పించుకుంది. అలా అని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్మెంట్ కు గ్యారెంటీ ఇవ్వదు లూడో. జస్ట్ పాస్ మార్కులతో నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ అయిన సగటు విద్యార్ధిలా గట్టెక్కింది. టైం చాలా ఫ్రీగా ఉంటే లూడోని ఛాయస్ గా పెట్టుకోవచ్చు.

లూడో – గందరగోళం కామెడీ