iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 60 – అమ్మోరు తల్లి

  • Published Nov 14, 2020 | 7:54 AM Updated Updated Nov 14, 2020 | 7:54 AM
లాక్ డౌన్ రివ్యూ 60 – అమ్మోరు తల్లి

హీరోలే డామినేట్ చేసే మార్కెట్ లో ఏళ్ళ తరబడి కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకుని దశాబ్దం పైగా రాజ్యమేలుతున్న నయనతార కొత్త సినిమా అమ్మోరు తల్లి(మూకుత్తి అమ్మన్)ఇవాళ పండగ గిఫ్ట్ గా ఉదయాన్నే డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదలైంది. ట్రైలర్ వచ్చాక దీని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ కాన్సెప్ట్ యునివర్సల్ గా అనిపించడంతో వ్యూస్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి దానికి తగ్గట్టు అమ్మోరు తల్లి విశ్వరూపం చూపించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం

కథ

కాశిబుగ్గ ఆకులపల్లి అనే ఊరిలో లోకల్ ఛానల్ కు టీవీ రిపోర్టర్ గా పని చేస్తుంటాడు రామస్వామి(ఆర్జె బాలాజి). తండ్రి చిన్నప్పుడే వదిలేసిపోవడంతో ముగ్గురు చెల్లెళ్ళు, అమ్మ, తాతయ్య బాగోగులు తనే చూసుకుంటూ ఉంటాడు. జనాన్ని మోసం చేస్తూ సామ్రాజాన్ని విస్తరించుకున్న భగవతి బాబా(అజయ్ ఘోష్)కాశిబుగ్గ చుట్టుపక్కల 11 వేల ఎకరాలను ఆక్రమించుకుని పంచవనం అనే బిజినెస్ వెంచర్ కు ప్లాన్ చేస్తాడు. ఓ మొక్కుబడి కోసం కుటుంబంతో కలిసి కులదేవత గుడికి వచ్చిన రామస్వామికి ముక్కుపుడక అమ్మోరు(నయనతార) ప్రత్యక్షమవుతుంది. అతనికో బాధ్యత అప్పజెబుతుంది. అది అతను ఎలా నెరవేర్చాడు, భగవతి ఆగడాలను అమ్మోరుతో కలిసి ఎలా అడ్డుకున్నాడు అనేది తెరమీద చూడాలి

నటీనటులు

ఈ సినిమా చూసేందుకు తెలుగు ప్రేక్షకులకున్న ఒకే ఒక్క కారణం నయనతార. టైటిల్ రోల్ కు న్యాయం చేకూర్చింది. ఓ సందర్భంలో హీరో పాత్ర చెప్పినట్టు దేవతలు ఇంత అందంగా కలర్ వేసుకున్న గ్రే హెయిర్ తో ఉంటారా అనిపించేలా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది. గెటప్ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ ఫలిచింది. నటన పరంగా మరీ ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించే సీన్స్ తనకు లేకపోవడం అభిమానులకు లోటే. క్యారెక్టర్ లెన్త్ సెకండ్ హాఫ్ లో చాలా తగ్గిపోవడం వాళ్లకు అసంతృప్తి కలిగిస్తుంది.

ఆర్జె బాలాజీ టేకాఫ్ నుంచి నయనతార ఎంట్రీ వరకు చాలా బ్యాలన్స్ గా చేసినా ఆ తర్వాత నుంచి తనలో ఓవర్ యాక్షన్ ని బయటికి తీశాడు. అవసరానికి మించిన ఎక్స్ ప్రెషన్లు, అరుపులతో అతి అనిపించే హడావిడి చేశాడు. కాస్త చెక్ చేసుకుని ఉంటే బాగుండేది. నయన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆనందంతోనో లేక ఇంకేదైనా కారణం వల్లనో తెలియదు కానీ మొత్తానికి రూపాయకు ఐదు రూపాయల పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఊర్వశి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. మొదటి అరగంట పూర్తిగా ఈవిడ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. విలన్ గా అజయ్ ఘోష్ ఓకే కానీ స్వంతంగా డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. మిగిలిన పాత్రల్లో పాండి కమల్, రాధా రామకృష్ణన్, లోకేష్, శంకర్ సుందరం, ఆనంద్ తదితరులు ఓకే అనిపించారు.

డైరెక్టర్ అండ్ టీమ్

దేవుడు ఉన్నాడా లేడా అనే పాయింట్ మీద వర్తమానానికి ఫాంటసీని జోడించి సినిమాలు తీయడం కొత్తేమి కాదు. అప్పుడెప్పుడో రావు గోపాల్ రావు-సత్యనారాయణల మా ఊళ్ళో మహాశివుడుతో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్-వెంకటేష్ ల గోపాల గోపాల దాకా చాలానే వచ్చాయి. అక్కినేని బుద్దిమంతుడు, రాజేంద్ర ప్రసాద్ కన్నయ్య కిట్టయ్యలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఈ కోణంలో చూస్తే అమ్మోరు తల్లి స్టోరీ పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేదు. అయితే ట్రీట్మెంట్ లో ఫ్రెష్ నెస్ ఉండేలా బాలాజీ-శరవణన్ సెట్ చేసుకున్న సన్నివేశాలు మొదట్లో కాస్త నవ్విస్తూనే ఆసక్తికరంగా సాగాయి.

అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కథా క్రమం ముందుకు వెళ్లే కొద్దీ దాన్ని ఎలా విస్తరించాలో అర్థం కాక విలన్ క్యారెక్టర్ భగవతి బాబా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో సినిమా పూర్తిగా ట్రాక్ తప్పింది. దొంగ బాబాల వల్ల కలుగుతున్న నష్టాన్ని, జనం మోసపోతున్న వైనాన్ని చూపించాలన్న తాపత్రయంలో పాత్రలతో ఎక్కువ సేపు క్లాసులు పీకించడం, సుదీర్ఘంగా వివరణలు ఇప్పించడం విపరీతం అయ్యేసరికి ఇంటర్వెల్ తర్వాత నుంచి అమ్మోరు తల్లి తెగ బోర్ కొట్టిస్తుంది. అమ్మోరు వచ్చాక వేగం అందుకున్నట్టు అనిపించినా ఆర్జె బాలాజీ తాను స్క్రీన్ మీద ఎక్కువ కనిపించేలా స్క్రిప్ట్ రాసుకోవడంతో తేడా కొట్టేసింది.

అనుకున్నంత మాత్రాన అన్నీ అమీర్ ఖాన్ పీకేలు కాలేవు. దానికి చాలా కసరత్తు కావాలి. పబ్లిక్ కి ఏదో గొప్ప మెసేజ్ ఇస్తున్నామనుకుని కనెక్ట్ కాలేని విధంగా ట్రాక్స్ రాసుకుంటే దెబ్బలు తప్పవు. అమ్మోరు తల్లిలో జరిగింది ఇదే. నయనతార ప్రవేశించాక ప్రేక్షకులు ఇకపై కథనం చాలా వేగంగా మంచి ట్విస్టులతో సాగుతుందని ఆశిస్తారు. అందుకు తగ్గట్టే కొన్ని సీన్స్ కూడా జరుగుతాయి. ఆ తర్వాతే అసలు ఇబ్బంది మొదలవుతుంది. ఎంతకీ ముందుకు సాగక ఒకే పాయింట్ చుట్టూ తిప్పి తిప్పి లేనిపోని సినిమాటిక్ లిబర్టీని తీసుకుని అర్థం లేకుండా చేసుకుంటూ పోయారు. విలన్ డెన్లో అమ్మోరు ఫైట్ చేయడం, మీడియా ఛానల్స్ లో దేవత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇదంతా ఎలా వెరైటీ అనుకున్నారో ఏమో

గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం పర్వాలేదు. పాటలు అతకలేదు. అనవసరంగా ఇరికించారు. బిజిఎం వరకు ఓకే. దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ చాలా రిచ్ విజువల్స్ వచ్చేలా అవుట్ ఫుట్ ఇచ్చారు. విజయ్ కుమార్ ఆర్ట్ వర్క్ చక్కగా కుదిరింది. సెల్వ ఎడిటింగ్ కత్తెరకు పని చెప్పాల్సి ఉన్నా ఆ అవకాశాన్ని వాడుకోలేదు. వేల్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రిచ్ నెస్ కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

నయనతార
ఫస్ట్ హాఫ్
కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
క్లైమాక్స్
ఆర్జె బాలాజీ ఓవరాక్షన్
లోపించిన కొత్తదనం

కంక్లూజన్

అమ్మోరు తల్లి టైటిల్ కు తగ్గట్టు ఇదేమీ పూనకాలు తెప్పించే భక్తిరస చిత్రం కాదు. కామెడీని మెసేజ్ ని బ్యాలన్స్ చేయాలనే ప్రయత్నంలో ఇద్దరు దర్శకులు పడిన తడబాటు మంచి ప్లాట్ ని తెరమీద వృథా చేసింది. నయనతార కోసమే సినిమా చూసేవాళ్లకు ఓ దశ దాటక విపరీతంగా చిరాకు పుట్టించే అమ్మోరు తల్లి ఫైనల్ గా యావరేజ్ కు ఓ మెట్టు కిందే నిలిచిపోయింది. కాసింత కామెడీతో కనీసం ఫస్ట్ హాఫ్ అయినా టైం పాస్ చేయించారని సంతృప్తి పడగగలితే తప్ప పండగపూట అమ్మోరు తల్లి మిమ్మల్ని మెప్పించడం కష్టమే.

అమ్మోరు తల్లి – రుచి లేని భక్తిరసం