iDreamPost
iDreamPost
లాక్ డౌన్ తర్వాత వ్యవసాయరంగం కూడా కుదేలవుతోంది. రవాణా నిలిచిపోవడంతో అమ్మకాలు లేకపోవడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. మార్కెటింగ్ కొరతతో చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆక్వా రైతులకు ఊరట కల్పించేలా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రోసెసింగ్ యూనిట్లు అన్నీ తెరిచేలా చర్యలు తీసుకుంది. ఎంపెడా సహాయంతో ఆక్వా కౌంట్ ని నిర్ధారించి, ధరలు ప్రకటించారు. ఆ ధరల లోపు కొనుగోలు చేయడానికి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దాంతో పాటుగా ఇతర పంటలకు కూడా రైతులకు నష్టం కలగకుండా చూసేందుకు యంత్రాంగం రంగంలో దిగింది. అందులో భాగంగా వ్యవసాయ, ఆక్వాఉత్పత్తులు, వాటి ధరలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే ప్రాససింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. అలా చేయడానికి ప్రాససింగ్ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎక్స్‌పోర్ట్ మార్కెటింగ్ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూస్తామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా రైతు తాను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకూడదుని , దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు సూచించారు.
ఇప్పటికే ఏపీలోని అన్ని మార్కెటింగ్ యార్డులు తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు మిర్చి యార్డ్ మినహా మిగిలిన అన్ని చోట్లా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ఆటంకాలు లేకుండా చూసేందుకు సమాయత్తమవుతోంది. నిల్వ చేసే అవకాశం లేని ఆయిల్ ఫాం, శనగలు వంటి పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.