iDreamPost
android-app
ios-app

లాక్‌డౌన్‌ 4.0 పై కేంద్ర హోంశాఖ ప్రకటన.. పొడిగింపు ఎప్పటి వరకంటే..

లాక్‌డౌన్‌ 4.0 పై కేంద్ర హోంశాఖ ప్రకటన.. పొడిగింపు ఎప్పటి వరకంటే..

లాక్‌డౌన్‌ నాలుగో విడత పొడిగింపుపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సబంధించిన మార్గదర్శకాలు మరికొన్ని గంటల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. దీంతో లాక్‌డౌన్‌ ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.

కరోనా వైరస్‌ కట్టడికి మొదటిసారిగా మార్చి 24 తేదీన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత రెండో విడత లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15 నుంచి మే 3వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్‌ కట్టడిలోకి రాకపోవడంతో మూడో సారి లాక్‌డౌన్‌ను మే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా మరోమారు 14 రోజుల పాటు అంటే.. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే లాక్‌డౌన్‌ నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నాలుగో విడతలో మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో ఈ సడలింపులు ఉంటాయని సమాచారం. రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్లు జోన్లలో అంక్షలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.

మొదటిసారిగా లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 25వ తేదీ నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 618 కాగా ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు చేరువలో ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 90,927 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో 34,109 మంది కోలుకోని ఇళ్లకు వెళ్లగా మరో 2,872 మంది మృత్యువాత పడ్డారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న 54 రోజుల్లో 90,309 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో రోజుకు సరాసరి 1,672 మందికి వైరస్‌ సోకింది.