iDreamPost
android-app
ios-app

పశ్చిమలో పార్టీలు సిద్ధమేనా…?

పశ్చిమలో పార్టీలు సిద్ధమేనా…?

రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కివచ్చేసింది…ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులువేస్తోంది. మరోవైపు సంక్రాంతి పండుగకు ముందే మండల పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుందనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీల బలాబలాలేంటి? బలహీనతలేంటో ఒకసారి చూద్దాం……

గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ తీవ్ర నైరాశ్యంలో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితిని గమనిస్తే ఐదు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వమే లేదు. దీంతో ఆయా నియోజవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం కరువైంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ పార్టీలో సర్దుబాటు జరగలేదంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లేనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని జిల్లా పార్టీ నాయకత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలోని సమస్యలను పసిగట్టిన చంద్రబాబు చింతలపూడి, పోలవరం, కొవ్వూరులకు పరిశీలకులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొవ్వూరు మినహా మిగిలిన రెండు నియోజకవర్గాల్లో ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పటికప్పుడు ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైతే…ఆయా నియోజకవర్గాల్లోని బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఏలూరులో పార్టీకి బలమైన నేతగా ఉన్న బడేటి బుజ్జి కొద్ది రోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. ఏలూరులో అంబికా కృష్ణ ఉన్నప్పటికీ ఆయనకు మాస్ లో పెద్దగా పట్టులేదు. భీమవరంలోనూ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. పార్టీ అధినాయకత్వానికి, అంజిబాబుకు మధ్య ఉన్న గ్యాప్‌ వల్ల నియోజవర్గంలో బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ పార్టీ ప్రభావం చూపలేకపోతోంది.

జిల్లాలో ప్రతిపక్షాలకు సంబంధించి తెలుగుదేశం తర్వాత జనసేనదే ప్రభావం. డెల్టాలో జనసేన కీలకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత సొంత సామాజికవర్గం అధికంగా ఉన్న తాడేపల్లిగూడెం, ఏలూరు, ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు నియోజకవర్గాల్లో జనసేన మోస్తారుగా ఓట్లు సాధించే అవకాశం ఉంది. అయితే ఓట్లను ఏమేరకు సీట్లుగా మలుచుకోగలుగుతుందనేది చూడాలి. జనసేన ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ఆర్థిక వ్యవహారాల్లో ఆ పార్టీ ఎలా నెగ్గుకు వస్తుందనేది సందేహమే. పైగా జనసేనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఇతర పార్టీలను ఢీకొట్టే సత్తా ఉందని ఆ పార్టీ నేతలు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే బీజెపీ ఆశించినంత కాకపోయినా కొద్ధిగా బలం పుంజుకుందనేది వాస్తవం. ఇటీవల జిల్లా అధ్యక్ష పదవిని ఎవరో ఒకరికి కట్టపెట్టాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. కానీ, అనుకోని కారణాలతో ఆ ప్రయత్నాలు వచ్చే నెలకు వాయిదాపడ్డాయి. బీజెపీకి గ్రామ స్థాయిలో ఆ పార్టీకి సరైన కేడర్ లేదు. కాబట్టి బీజెపీ ప్రభావం అంతంతమాత్రమే. ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఆ పార్టీలో నాయకులమంటూ కొందరు హడావిడీ చేస్తున్నా…ప్రజలెంత వరకు వారిని గుర్తిస్తున్నారనేది అనుమానమే. వామపక్షాలు దాదాపు 20 మండలాల్లో ఒకింత యాక్టివ్‌గా ఉన్నాయి.

అధికార పార్టీ వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం ఎన్నికలపై పూర్తి ధీమాగా ఉంది. జిల్లాలోని 13 స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీకి మంచి విజయావకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో సీటు దక్కించుకుంటే చాలు గెలుపు తమదేననే ధీమాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలున్నారు. పార్టీ కేడర్ మండలాల్లో ఉత్సహంగా పనిచేస్తోంది. ఐతే సీట్ల కోసం నేతలు అదే స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవదాయ కమిటీల్లో పలువురికి స్థానం కల్పించింది. దీంతో ఆశావాహులు తగ్గే అవకాశం ఉందని ఆ పార్టీ ఆశిస్తోంది. సీట్లకు ఎక్కువ మంది పోటీ పడుతుండటం…ఒకే సామాజికవర్గం నుంచి పోటీ తీవ్రంగా ఉండటం వైఎస్సార్‌సీపీకి ఇబ్బందిగా మారాయి. ఎంపీపీలు, జెడ్‌పీటీసీల రిజర్వేషన్ల ఆధారంగా గెలుపోటములు ఉంటాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమలో వైఎస్సార్‌సీపీ ధీమాగా ఉంటే…ప్రతిపక్షాలు పరిస్థితి ఒకింత ఇబ్బందికరంగా ఉంది.