iDreamPost
iDreamPost
100 రూపాయలు ఎప్పుడో దాటేసిన పెట్రోలు సగం రేటుకే ఇస్తామంటే జనాలు ఎగబడకుండా ఉంటారా. ఇవాళ (జూన్ 14) న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఇదే జరిగింది. ఇవాళ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పుట్టిన రోజు కావడంతో తమ అభిమాన నేత పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. అయితే తమ అధినేత 54వ పుట్టినరోజున ఏదైనా మంచిపని చేయాలని భావించిన పార్టీ ఉపాధ్యక్షులు మౌళి థోర్వే, సవితా థోర్వే ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో లీటరు పెట్రోలును రూ.54కే విక్రయించారు. ఔరంగాబాద్ క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్‌లో రోజంతా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని ప్రకటించడంతో వినియోగదారులు ఎగబడ్డారు. దాదాపు సగం రేటుకే పెట్రోలు వస్తుండటంతో ఉదయం ఆరు గంటల నుండే పెట్రోల్ బంకు ముందు క్యూ కట్టారు. బంకులో ఉన్న పెట్రోల్ అయిపోయేంతవరకు ఈ ఆఫర్ ని కొనసాగించారు. చివర్లో పెట్రోల్ అందని వాళ్ళు నిరాశతో వెనుదిరిగారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాత్రం తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలకు ఓ ఆడియో సందేశం పంపించారు. ఆ ఆడియోలో.. కరోనా డెడ్‌సెల్స్‌కు సంబంధించి నాకు శస్త్రచికిత్స జరగబోతోంది. ప్రస్తుతానికి అది వాయిదా పడింది. కానీ ఇన్‌ఫెక్షన్ రిస్క్ తీసుకోలేను. అందుకే జూన్ 14న నా పుట్టినరోజునాడు ఎవరినీ కలవలేను. నా శస్త్రచికిత్సను వైద్యులు వచ్చే వారం షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం నేను ఎవరినీ కలవలేను. ఈ పుట్టిన రోజు మీ అందరికి దూరంగా ఉండటం నాకు బాధ కలిగిస్తుంది అని తెలిపారు.