iDreamPost
android-app
ios-app

మాంసాహారంతో పాటు ‘మందు’ కూడా..

  • Published Oct 27, 2020 | 1:20 PM Updated Updated Oct 27, 2020 | 1:20 PM
మాంసాహారంతో పాటు ‘మందు’ కూడా..

కోవిడ్‌ సమయంలో సంమృద్ధిగా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచించారు. దీంతో జనం చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్, గుడ్డు తదితర మాంసాంహారంపై పడ్డారు. సరే మంచిదే కదా పౌష్టికాహారం తినడం ద్వారా కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని సరిపెట్టుకున్నాం. అయితే వీటితో పాటు మద్యం కూడా భారీగానే లాగించేసారట. ఏకంగా గత యేడాది ఈ సీజన్‌తో పోలిస్తే 30శాతానికిపైగా మద్యం తాగేసినట్టు లెక్కలు తేలుస్తున్నాయి.

తెలంగాణాలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైపోతోంది. గత యేడాది కంటే ఏకంగా ఆరువందల కోట్లకుపైగానే మందును తాగేసారు. గత యేడాది 1,374 కోట్లు అమ్మకాలు జరగ్గా ఈ యేడాది 1,979 కోట్లు అమ్మినట్లు తెలంగాణా అబ్కారీశాఖ లెక్కలు తేల్చింది. దాదాపుగా నాలుగున్నరలక్షల కేసుల లిక్కర్, మరో నాలుగున్నర లక్షల కేసుల బీర్లు దసరా పండుగను పురస్కరించుకుని మద్యం ప్రియులు కొనుగోలు చేసేసారు. కేవలం మూడు రోజుల్లోనే 406 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయంటే మందుబాబుల జోరు అర్ధం చేసుకోవచ్చును.

ఒక పక్క కోవిడ్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం, అన్ని రంగాలు అథోగతే అంటూ నిపుణులు అంచనాలు వేస్తుంటే మందుబాబులు మాత్రం తమదైన ధోరణిలో మద్యంపై ఖర్చు చేసే మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ ధోరణిపై భిన్నమైన అభిప్రాయాలే విన్పిస్తున్నాయి.